అమరావతి: దివంగత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణకు నివాళులర్పించారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. హరికృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకున్నారు. 

చెరగని చిరునవ్వు, భోళాతనం, చిన్నాపెద్దా అందరికీ ఆత్మీయతను పంచే మంచితనం వీటన్నిటికీ నిలువెత్తురూపం మావయ్య హరికృష్ణ అంటూ చెప్పుకొచ్చారు. హరికృష్ణ మరనించి ఏడాది గడిచినా ఆయన లేరనే విషయం నమ్మలేకపోతున్నట్లు తెలిపారు. హరికృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిద్దామంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

ఇకపోతే 2018 ఆగష్టు 29న నందమూరి హరికృష్ణ నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. తన సన్నిహితుడి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్న హరికృష్ణ కారు నల్గొండలో అదుపుతప్పడంతో ఆ ప్రమాదంలో అక్కడికక్కడే ఆయన దుర్మరణం చెందారు. అయితే ఆ సమయంలో ఆయనే డ్రైవింగ్ చేయడం విశేషం.