అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మూడు ముక్కలాట మొదలు పెట్టి సగం చచ్చారని, ప్రతిపక్ష నేత యాత్రను అడ్డుకునేందుకు గొయ్యి తవ్వి పూర్తిగా చచ్చారని ఆయన అన్నారు వైసీపీ డీఎన్ఎలో ఉన్న దుర్మార్గం, దౌర్జన్యం, దాడులు విశాఖలో బయటపడ్డాయని ఆయన అన్నారు. 

"జగన్ గారూ... విశాఖలో అడుగు పెడితే ఉత్తరాంధ్రలో అరాచకం ఏ రేంజ్ లో ఉంటుందో వైసీపీ ఈ రోజు ట్రైలర్ చూపించింది. ప్రతిపక్ష నేతపై ఈ రోజు గుడ్లు, టోమేటోలు... రేపు ప్రజలపై బాంబులు, కత్తులతో దిగుతుంది వైసీపీ రౌడీ బ్యాచ్" అని ఆయన ట్వీట్ చేశారు. 

చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకోవడం దారుణమని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విశాఖ విమానాశ్రయంలో యుద్ధ వాతావరణం సృష్టిస్తారా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు కాన్వాయ్ పై వైసీపీ దాడికి దిగడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఫాక్షన్ రాజ్యం చేస్తారా అని నిలదీశారు. 

వైసీపీ అరాచకాల కోసం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తారా అని యనమల అడిగారు. ప్రజల వద్దకు వెళ్లే స్వేచ్ఛ ప్రజాప్రతినిధులకు లేదా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు గృహ నిర్బంధాలుండవా అని అడిగారు. చంద్రబాబు కాన్వాయ్ పై కోడిగుడ్లు విసురుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా అని ఆయన అన్నారు. 

కావాలనే చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తతలు సృష్టించారని, వైసీపీ రౌడీల బారి నంచి విశాఖను కాపాడుకోవాల్సింది ప్రజలేనని ఆయన అన్నారు.