ఏపీ సీఎం జగన్ పత్రికలో కనిపించిన పండుగ రైతుల కళ్లలో కనిపించడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. పండిన ప్రతి గింజకి గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని ఇచ్చిన మాట గాలిలోనే కలిసి పోయిందన్నారు. 

‘‘జగన్ రెడ్డి పత్రికలో కనపడిన పండుగ రైతుల కళ్ళలో కనపడటం లేదు. పండిన ప్రతి గింజకి గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తాం అని ఇచ్చిన మాట గాలి మాటగానే మిగిలిపోయింది. అర్థంపర్థం లేని నిబంధనలు, అరకొర కొనుగోళ్లు వెరసి రైతులకు శాపంగాను, దళారులకు వరంగాను మారాయి. 

పోనీ కొన్న ధాన్యానికి సొమ్ము చెల్లించారా అంటే అదీ లేదు. రూ.2574 కోట్లు బకాయి పెట్టారు. పండించిన పంటకి మద్దతు ధర రాదు, ప్రభుత్వం కొన్న ధాన్యానికి చెల్లింపులు చెయ్యరు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు పండగ ఎలా చేసుకోవాలి జగన్ రెడ్డి?’’ అని నారా లోకేష్ ట్వీట్‌లో ప్రశ్నించారు.