Asianet News TeluguAsianet News Telugu

వైసిపి ఎమ్మెల్సీ కారులో మృతదేహం... సిబిఐ ఎంక్వైరీకి నారా లోకేష్ డిమాండ్

వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద పనిచేసే డ్రైవర్ ఆయన కారులోనే మృతదేహంగా కనిపించడం కలకలం రేపింది. ఎమ్మెల్సీయే డ్రైవర్ సుబ్రహ్మణ్యంను కొట్టిచంపాడని నారా లోకేష్ ఆరోపించారు. 

nara lokesh demands cbi inquiry on ysrcp mlc anantbabu driver death
Author
Amaravati, First Published May 20, 2022, 10:45 AM IST

అమరామతి: అధికార వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు (mlc anatbabu) కారులో యువకుడి మృతదేహం కలకలం రేపుతోంది. తనవద్ద గతంలో డ్రైవర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని స్వయంగా ఎమ్మెల్సీ అనంతబాబు కారులో తీసుకురావడం ఉద్రిక్తతకు దారితీసింది. పుట్టినరోజు వుందంటూ ఎమ్మెల్సీయే తన కొడుకును తీసుకెళ్లి కొట్టిచంపాడని బాధిత కుటుంబం ఆరోపిస్తుంటే రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని ఎమ్మెల్సీ చెబుతున్నారు. కారణమేదైనా అధికారపార్టీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం వుండటం దుమారం రేపుతోంది. 

ఈ  ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) స్పందించారు. గతంలో శాంతిభద్రతలు అదుపులో వుండి ఎంతో ప్రశాంతమైన ఆంధ్ర ప్రదేశ్ వైసిపి అధికారంలో వచ్చాక బిహార్ కంటే దారుణంగా తయారయ్యిందన్నారు. వైసిపి మాఫియా, వైసిపి నాయకుల నేరాలు, ఘోరాలకి సామాన్యులు బలైపోతున్నారని లోకేష్ ఆందోళన వ్యక్తం చేసారు. 

''తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంని అత్యంత దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు, యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస క్రీడకు అద్దం పడుతోంది. ఎమ్మెల్సీ అనంత బాబు తమ కుమారుడ్ని బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయినా అతన్ని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదు'' అని లోకేష్ నిలదీసారు. 

''వైసిపి ప్రజాప్రతినిధులు, నాయకులకు హత్యలు, అరాచకాలు చేసుకోమని స్పెషల్ లైసెన్స్ ఏమైనా ప్రభుత్వం ఇచ్చిందా? సుబ్రహ్మణ్యంని హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు, అతని అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలి. హత్యపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి. ఎంతో భవిష్యత్తు ఉన్న కొడుకుని కోల్పోయిన ఆ తల్లిదండ్రులను ప్రభుత్వం ఆదుకోవాలి'' అని లోకేష్ డిమాండ్ చేసారు. 

అసలేం జరిగింది: 

తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన అధికార వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద సుబ్రహ్మణ్యం గతంలో కారు డ్రైవర్ గా పనిచేసాడు. అయితే అతడు ఎమ్మెల్సీ వద్ద పని మానేసాడు. కానీ గతంలో అవసరాల కోసం ఎమ్మెల్సీ వద్ద తీసుకున్న రూ.20వేలు బకాయి పడ్డాడు. ఈ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఎమ్మెల్సీ తన కొడుకుపై ఒత్తిడి తెచ్చేవాడని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు తెలిపారు. కొంత సమయం ఇస్తే ఈ డబ్బులు తిరిగి ఇస్తామని సుబ్రమణ్యం ఎమ్మెల్సీకి చెప్పారని కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు.

అయితే గురువారం ఉదయం ఎమ్మెల్సీ అనంతబాబు పుట్టినరోజు వుండటంతో స్వయంగా ఆయనే సుబ్రహ్మణ్యంను ఇంటినుండి తీసుకెళ్లాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. తిరిగి ఎమ్మెల్సీయే తన కారులో సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తీసుకువచ్చాడని చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం చనిపోయాడని... హాస్పిటల్ కు తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఎమ్మెల్సీ చెప్పాడని తెలిపారు. కానీ ఎమ్మెల్సీ మాటలు నమ్మశక్యంగా లేవని... అతడే సుబ్రహ్మణ్యంను కొట్టిచంపి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

ఎమ్మెల్సీ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించకుండా పోలీసులను బంధువులు, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఈ విషయమై ప్రభుత్వం నుండి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తుంది. పోలీసులతో బాధిత కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. పోలీసులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios