అమరావతి: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన శ్రీనివాస రావు టీడీపీ కార్యకర్త అంటూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చేసిన విమర్శలను మంత్రి నారా లోకేష్ తిప్పికొట్టారు. 
 శ్రీనివాస రావుకి చెందిన టీడీపీ సభ్యత్వ కార్డు అంటూ వైసీపీ నేతలు బయటపెట్టిన వివరాలు తప్పు అని ఆయన అన్నారు. సాక్షి టీవీ చానెల్ ఫుటేజీని కూడా ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. 

ట్విట్టర్ వేదికగా వైసిపి నేతలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలు చూపిస్తున్న కార్డులో ఉన్న నంబర్ 05623210 అంకాలు నంబూరి అనే వ్యక్తి పేరు మీద ఉందని, అవన్నీ ఫొటో షాప్ జిమ్మికులని ఆయన అన్నారు. 

మీరు మారరు .. మీ నాయకుడు మారడని లోకేష్ వ్యంగ్యాస్త్రం విసిరారు. జగన్ నీచ రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైకాపా ట్రేడ్ మార్క్ మార్ఫింగ్ ట్రిక్స్ అని, దాడి చేసింది తన అభిమానే అని ఒప్పుకునే ధైర్యం లేని నాయకుడు జగన్ మోడీ రెడ్డి అని ఆయన అన్నారు. 

తన అభిమానిని టీడీపీ కార్యకర్తగా చిత్రిస్తూ చీప్ ఫోటో షాప్ జిమ్మికులని, కనీస అవగాహన కూడా లేకుండా ముమ్మిడివరం మండలం అమలాపురం నియోజకవర్గంలోనిది అంటూ ఫేక్ మెంబెర్ షిప్ కార్డ్ తయారు చేశారని ఆయన విమర్శించారు. ఇంత నీచ రాజకీయం చేసే వ్యక్తి జగన్ మోడీ రెడ్డి తప్ప మరొకరు ఉండరని ఆయన వ్యాఖ్యానించారు.