అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా విజృంభణ నేపధ్యంలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ పరీక్షలు నిర్వహించవద్దని చెబితే తనపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తిడుతున్నాడని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కావాలంటే వారి నోటికొచ్చిన‌ట్టు మ‌రో అర‌గంట నన్ను తిట్టండి... కానీ ప‌రీక్ష‌లు మాత్రం ర‌ద్దు చేసి విద్యార్థుల్ని కాపాడండి అని లోకేష్ విజ్ఞప్తి చేశారు.  
 
''విద్యాశాఖా మంత్రి సురేష్ గారు! మీరు మొండిగా నిర్వ‌హిస్తామంటున్న ప‌రీక్ష‌ పాసో, ఫెయిలో నిర్ణ‌యించేది కాదు.  15 ల‌క్ష‌ల మంది విద్యార్థులు, ప‌రీక్ష నిర్వ‌హించే 30 వేల‌మంది ఉపాధ్యాయులు, ల‌క్షలాది కుటుంబ‌ స‌భ్యులంద‌రితో క‌లిపి దాదాపు కోటి మంది ప్రాణాల‌కు ఇది విష‌మ‌ ప‌రీక్ష‌. అందుకే మాన‌వ‌తా దృక్ప‌థంతో ఆలోచించాల‌ని ముఖ్య‌మంత్రి గారికి లేఖ రాశాను. ఆ లేఖ రాసిన‌త‌రువాతే ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీరుతామ‌ని ప్ర‌క‌టించారు. అందుకే మూర్ఖ‌పురెడ్డి అని సంబోధించాల్సి వ‌చ్చింది'' అంటూ తన విమర్శలకు మరోసారి వివరణ ఇచ్చుకున్నారు లోకేష్. 

''పంతాలు, ప‌ట్టింపుల స‌మ‌యం కాదు. నా విదేశీ చ‌దువు, ఫీజుల గురించి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్ని వివ‌రాలు పంపిస్తాను. మీరు బాగా చ‌దువుకున్న‌వారే కాబ‌ట్టి అవి మీకు అర్థ‌మవుతాయి. మ‌రోసారి తాడేప‌ల్లి కాంపౌండ్ కాపీ పేస్ట్ స్క్రిప్ట్‌తో ఆరోప‌ణ‌లు చేయ‌ర‌ని ఆశిస్తున్నాను. ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసి మంచి మేన‌మామ అనిపించుకుంటాడో,  ప‌రీక్ష‌లు పెట్టి కంసుడులాంటి మేన‌మామ అనిపించుకుంటాడో మీ మూర్ఖ‌పు రెడ్డి ఇష్టం'' అని నారా లోకేష్ పేర్కొన్నారు. 

read more   ప‌రీక్ష‌లు ర‌ద్దుకు 48 గంట‌ల డెడ్‌లైన్‌... లేదంటే పోరాటమే..: లోకేష్ హెచ్చరిక

కొద్దిసేపటి క్రితమే నారా లోకేష్ పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శలు చేశారు. ''లోకేష్‌ ఒక అజ్ఞాని అని రుజువు చేసుకున్నాడు. అందరూ ఆయనను వెర్రినాయుడు అంటున్నారు. ఈ అవకాశాన్ని ఆయన రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నాడు. నిజానికి సీఎం జగన్‌ పిల్లలకు మేనమామగా వారిని చదివిస్తూ, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ, బాగా చదువుకోవాలని ఫీజులు చెల్లిస్తూ, హాస్టల్‌ ఖర్చులు కూడా భరిస్తూ,  ఎన్నో చేస్తున్నారు. కానీ లోకేష్‌ మాదిరిగా ఎవరో ఫీజు కడితే, ఎవరో పరీక్ష రాస్తే  పాస్‌ అవలేదు. అలాంటి వ్యక్తి స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుకున్నానని చెబుతావు'' అని విద్యామంత్రి మండిపడ్డారు

''ఇక్కడ విద్యార్థులు ఎంతో కష్టపడి చదువుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలతో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెట్టడం, నాడు–నేడుతో స్కూళ్లలో సమూల మార్పులు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. ఒక్క ఏడాదిలోనే దాదాపు 4.5 లక్షల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చేరారు'' అని తెలిపారు. 

''పరీక్షలు నిర్వహిస్తే దాదాపు 70 లక్షల మంది విద్యార్థులకు కరోనా సోకుతుందని లోకేష్‌ చెబుతున్నాడు. కరోనా వస్తుందని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. సీఎంపై బురద చల్లే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. వకీల్‌సాబ్‌ సినిమాను నాలుగు కాదు, ఆరు షోలు వేయాలని చంద్రబాబు అన్నాడు. దాన్ని రాజకీయం చేసి తిరుపతి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసినప్పుడు, లోకేష్‌ ఎక్కడికి పోయావు? అప్పుడు నీకు కరోనా ముప్పు కనిపించలేదా? నీకు అవేవీ కనబడవు. ఎందుకంటే వకీల్‌సాబ్‌ సినిమాతో రాజకీయ ప్రయోజనం పొందాలని చూశావు'' అని ఆరోపించారు.