పోలవరం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకోవడం తగ్గించాలని ధ్వజమెత్తారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. తెలుగుదేశం హయాంలో ప్రతిపాదించిన రూ.55,548 కోట్ల సవరించిన పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించిందని లోకేశ్ గుర్తుచేశారు.

గతంలో టీడీపీ ప్రభుత్వం పంపిన అంచనాలు అన్నింటికీ కేంద్రం ఆమోదం తెలిపితే, అవినీతి ఎక్కడ నుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఎప్పుడో ఆమోదించిన విషయాన్ని తమ గొప్పతనమని వైసీపీ నేతలు డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదమని లోకేశ్ మండిపడ్డారు.

అవినీతికి తావు లేకుండా కేవలం ప్రజల కోసం చంద్రబాబు అహర్నిశలు పడ్డ కష్టానికి ఫలితం పోలవరం ప్రాజెక్ట్‌ అని పేర్కొన్నారు. ఇప్పటికైనా బీజేపీ, వైసీపీ నేతలు టీడీపీపై బురద జల్లడం మాని.. పోలవరం ప్రాజెక్ట్ మిగిలిన 30 శాతం పనులను పూర్తి చేయటంపై దృష్టిపెడితే మంచిదని లోకేశ్ సూచించారు.