అమరావతి: తమ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి విశాఖ పర్యటనను అడ్డుకోవడంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీపై తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ట్విట్టర్ లో వరసు పోస్టులు పెడుతూ వీడియోలు జత చేస్తున్నారు. 

"ఇంటికి తాళ్లు కట్టారు, ఇప్పుడు విశాఖ లో అడ్డుకోమని పిలుపిచ్చారు. ప్రజలకు మేలు చేసేవాళ్ళు అయితే ప్రతిపక్ష నాయకుడు బయటకు  వస్తే భయపడటం ఎందుకు? అడ్డుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోయే సరికి 500 ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపారు" అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. 

 

ఆఖరికి విద్యార్థులను కూడా జగన్ స్వార్ధ రాజకీయానికి వాడుకుంటున్నారని లోకేష్ ట్వీట్ చేశారు. బలవంతంగా వైకాపా నాయకులకు చెందిన కాలేజీల నుండి విద్యార్థులను తీసుకొచ్చారని, పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారని, ఎన్ని సార్లు అడ్డుకున్నా తుగ్లక్ నిర్ణయాల పై పోరాటం ఆగదని ఆయన అన్నారు. ఆ వ్యాఖ్యకు కొంత మంది విద్యార్థుల ఫొటోను జత చేశారు.