బాధను చెప్పుకునేందుకు దుర్గమ్మ దర్శనానికి వచ్చాను..: చంద్రబాబు అరెస్ట్‌పై నారా భువనేశ్వరి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. చంద్రబాబు ప్రజల కోసమే పోరాడుతున్నారని అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ఆయన సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. చంద్రబాబు ప్రజల కోసమే పోరాడుతున్నారని అన్నారు. నారా భువనేశ్వరి, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామరావు తనయుడు రామకృష్ణ ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన భువనేశ్వరి.. తన మనసులోని బాధను చెప్పుకోవడానికి దుర్గమ్మ వద్దకు వచ్చినట్టుగా చెప్పారు. చంద్రబాబును రక్షించాలని, ఆయనకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని దుర్గమ్మను కోరుకున్నట్టుగా చెప్పారు.
ఏపీ ప్రజల స్వేచ్ఛ, హక్కుల కోసమే చంద్రబాబు పోరాడుతున్నారని భువనేశ్వరి అన్నారు. చేయి చేయి కలిపి చంద్రబాబు చేసే పోరాటాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. అది ప్రజల హక్కు అని పేర్కొన్నారు.
నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబును పాత కేసులో అరెస్ట్ చేశానని అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు. తెలుగు ప్రజల కోసం చంద్రబాబు ఎంత కష్టపడుతున్నారనేది అందరికి తెలిసిందేనని అన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసేందుకు అందరం కష్టపడదామని పిలుపునిచ్చారు. అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్‌గా నిలుపుదామని అన్నారు.