నాలో ఒక భాగం అక్కడే వదిలేసినట్టుగా అనిపించింది.. ఆయన సెక్యూరిటీపై భయంగా ఉంది: భువనేశ్వరి (వీడియో)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆయన నిర్మించిన భవనంలోనే కట్టిపడేశారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆయన నిర్మించిన భవనంలోనే కట్టిపడేశారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. జైలు ఆయనను కలిసి వస్తుంటే.. తన ఒక భాగమేదో అక్కడ వదిలేసి వచ్చినట్టుగా ఉందని చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు నాయుడుతో ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణిలు.. అక్కడి సంబంధిత ప్రక్రియ అనంతరం లోనికి వెళ్లారు. చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. అనంతరం భువనేశ్వరి మీడియాతో మాట్లాడారు.
మీడియా వాళ్లు మాట్లాడమని అంటున్నారని.. ఏం మాట్లాడాలని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనైనా, విభజన తర్వాత ఏపీలోనైనా పొద్దున నుంచి రాత్రి వరకు ప్రజల గురించే చంద్రబాబు ఆలోచించేవారని చెప్పారు. ప్రజల అభివృద్ది కోసం ఆయన జీవితం మొత్తం కృషి చేశారని అన్నారు. ఎప్పుడైనా తాను కుటుంబం గురించి మాట్లాడితే, గట్టిగా నిలదీస్తే.. ముందు ప్రజలే ముఖ్యమని ఆయన చెప్పేవారని తెలిపారు. ఇప్పుడు ఆయన నిర్మించిన బిల్డింగ్‌లోనే ఆయనను కట్టిపడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలందరి హక్కు, స్వేచ్చ కోసం పోరాడే వ్యక్తిని.. ఇలా ఏమి లేని కేసులో జైలులో పెట్టడంపై ఆలోచన చేయాలని కోరారు. ప్రజలంతా బయటకు వచ్చి వారి హక్కుల కోసం పోరాడాలని కోరారు. ఆయనను కలిసి బయటకు వస్తుంటే తన భాగం ఒకటి అక్కడ వదిలేసినట్టుగా అనిపిస్తుందని చెప్పారు. ఇది కుటుంబానికి చాలా కష్టకాలమని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ నిర్మించారని.. ఈ పార్టీ ఎక్కడకు వెళ్లదని అన్నారు. తమ కుటుంబం ఎప్పుడూ క్యాడర్ కోసం, ప్రజల కోసం పోరాడి నిలుస్తుందని చెప్పారు. తమ కుటుంబం తరఫు నుంచి ఈ హామీ ఇస్తున్నట్టుగా తెలిపారు. తాను ఎప్పుడూ ఇలా వస్తానని ఊహించలేదని అన్నారు. ‘‘అక్కడ కూడా ప్రజల గురించే ఆయన ఆలోచిస్తున్నారు.. ఆరోగ్యం గురించి అడిగితే తాను బాగున్నాను.. ఆందోళన చెందొద్దు అన్నారు. ఆయనకు నెంబర్ వన్ సౌకర్యం ఇవ్వాలి. కానీ అదేమి అక్కడ కనిపించలేదు. ఆయన చన్నీళ్లతోనే స్నానం చేస్తున్నారు’’ అని భువనేశ్వరి పేర్కొన్నారు. చంద్రబాబు సెక్యూరిటీపై భయంగా ఉందని అన్నారు.