విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ అడిషనల్ డీజీపీ కృపానంద్ త్రిపాఠి ఉజాలా కు పెను ప్రమాదం తప్పింది. కంచికచర్ల పట్టణం శివారులో అడిషనల్ డీజీపీ ప్రయాణిస్తున్న కారు బైక్‏ను ఢీకొట్టి అదుపుతప్పి రహదారి పక్కన గల కందకంలోకి దూసుకెళ్ళింది. అయితే ఈ ప్రమాదం నుండి కృపానంద్ త్రిపాఠి ఉజాలా సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆయనను వేరే కారులో అక్కడినుండి తరిలించారు.

అయితే కారు ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. బైక్ పై ఉన్న వ్యక్తి కంచిక చర్ల పట్టణానికి చెందిన కర్రీ నరసింహరావు గా పోలీసులు గుర్తించారు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం కారణంగా ట్రాఫిక్ జామ్ అవగా వాహనాలకు క్లియర్ చేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.