టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి . కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెడితే ఆ యువ నాయకుడు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టార్గెట్‌గా సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి . మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వార్డ్ మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తి పాదయాత్ర చేస్తున్నాడంటూ చురకలంటించారు. ఫైబర్ నెట్ స్కాంలో దోపిడీకి పాల్పడ్డవాడు నీతిమంతుడిగా ప్రజల ముందుకు వస్తున్నాడని ఆమె ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెడితే ఆ యువ నాయకుడు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. వందరూపాయల చీర, పుచ్చిపోయిన కందిపప్పు ఇస్తామని పిలిచి అమాయకుల ప్రాణాలు తీశారంటూ లక్ష్మీపార్వతి గుంటూరు తొక్కిసలాటను ప్రస్తావించారు. టీడీపీ నాయకులకు అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా ప్రత్యేక రాజ్యాంగం వుందా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబులో పశ్చాత్తాపం లేదని లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. కమ్యూనిస్ట్ నేతలు తమ పార్టీలను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఆమె ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పుడు మార్గంలో వెళ్తున్నారని.. చంద్రబాబుతో కలిసి వెళ్తే ఆయనకు చివరికి మిగిలేది నష్టమేనని ఆమె వ్యాఖ్యానించారు.
ఇదిలావుండగా.. ఇటీవల టీడీపీలో నాయకత్వ విషయంగా లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లోకేష్ నాయకత్వాన్ని సమర్ధించడానికి ఎన్టీఆర్ సిద్ధంగా లేరని అన్నారు. ఒకవేళ పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తాడని తాను భావిస్తున్నట్లు లక్ష్మీ పార్వతి అన్నారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి జగన్ సీఎం అవుతారని దేవుడు ఎప్పుడో నిర్ణయించాడని ఆమె వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జగన్‌ని ఎవరూ ఎదిరించలేరని.. ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాల వల్లే ప్రజలంతా జగన్ వెంట వెన్నారని లక్ష్మీపార్వతి అన్నారు. టీటీడీ నిర్వహణ బాగుందని ఆమె కితాబిచ్చారు.
ALso REad: నారా లోకేష్ పాదయాత్రకు చిత్తూరు ఎస్పీ అనుమతి.. ఈ షరతులు పాటించాల్సిందే..
ఇకపోతే.. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు చిత్తూరు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే జిల్లాలో లోకేష్ పాదయాత్రకు పలు షరతులు విధించారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే పాదయాత్ర అనుమతి ఇవ్వడం జరిగిందని చెప్పారు. పాదయాత్రలో ప్రజలు, వాహన దారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్ రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదని స్పష్టం చేశారు. బహిరంగ సభల సమయాలకు కట్టుబడి ఉండాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించకూడదని.. రోడ్డపై ఎలాంటి సమావేశాలు నిర్వహించాకుడదని తెలిపారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి నిర్వాహకులు సమావేశ స్థలంలో ప్రథమ చికిత్స, వైద్య పరికరాలతో అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలని చెప్పారు ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సమావేశ స్థలం దగ్గర అగ్నిమాపక యంత్రం ఉంచాలని స్పష్టం చేశారు.