Asianet News TeluguAsianet News Telugu

చర్చనీయాంశంగా బాలయ్య డైలాగ్స్.. జగన్‌ని ఉద్దేశించినవేనా, వైరలవుతోన్న వీరసింహారెడ్డి ట్రైలర్

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘‘వీరసింహారెడ్డి’’ సినిమాలోని డైలాగ్స్ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లుగా డైలాగ్స్ వున్నాయి. 

nandamuri balakrishna veera simha reddy dialogues goes viral
Author
First Published Jan 6, 2023, 10:12 PM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘‘వీరసింహారెడ్డి’’ సినిమా ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. మాస్‌కి పూనకాలు తెప్పించేలా ఆ ట్రైలర్‌ను కట్ చేశారు మేకర్స్. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా ట్రైలర్ చివరిలోని ‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో - ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు’ అంటూ  బాలయ్య చెప్పే డైలాగ్ వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లుగా వుందంటూ టీడీపీ అభిమానులు చర్చించుకుంటున్నారు. 

దీనికి కారణం లేకపోలేదు.. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును జగన్ ప్రభుత్వం మార్చింది. దానికి డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేసింది. దీనిపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వైద్య రంగానికి ఎన్టీఆర్ చేసిన సేవలకు గుర్తింపుగా హెల్త్ యూనివర్సిటీకి ఈ పేరు పెట్టారని.. జగన్ తండ్రి వైఎస్ కూడా ఈ పేరును మార్చలేదని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గుర్తుచేసింది. ఇవేవి పట్టించుకోని జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దీనిపై కొద్దిరోజుల పాటు టీడీపీ ఆందోళన చేసింది . కానీ తర్వాత అంతా ఈ విషయాన్ని మార్చిపోయారు.

అయితే .. సీఎం జగన్ తో పాటు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై బాలకృష్ణ అప్పట్లో తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కేవలం యూనివర్సిటీకి పేరు మార్చినంత మాత్రాన ఎన్టీఆర్ ఖ్యాతి తగ్గదని... ఆయనను ప్రజల మనసుల్లోంచి చెరిపివేయలేరని అన్నారు. మహనీయుడి పేరుమార్చిన మిమ్మల్సి మార్చడానికి ప్రజలు సిద్దంగా వున్నారని బాలయ్య పేర్కొన్నారు. 

''మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు... ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక. తండ్రి (వైఎస్సార్) గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు... కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు…… పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త...'' అంటూ సీఎం జగన్ కు బాలయ్య  హెచ్చరించారు. 

''వైసిపిలో ఆ మహనీయుడు (ఎన్టీఆర్) పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు... పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్... శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు..'' అంటూ టిడిపిలోంచి వైసిపిలో చేరిన కొందరు నాయకులపై  బాలయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా వీరసింహారెడ్డిలోని ఆ డైలాగ్స్ జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించినవేనంటూ చర్చ జరుగుతోంది. ఇక సినిమా మొత్తంలో ఇలాంటి పంచ్ డైలాగ్స్ ఇంకేమైనా వున్నాయేమోనంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఇదిలావుండగా.. ‘అఖండ’ తర్వాత ‘వీరసింహారెడ్డి’ రాబోతుండటంతో సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కి రెడీగా ఉంది. బాలయ్య సరసన గ్లామర్ బ్యూటీ శ్రుతి హాసన్ నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios