Asianet News TeluguAsianet News Telugu

పాలనలో ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తెచ్చారు : బాలకృష్ణ

పరిపాలనలో ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారని అన్నారు ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారున్నా వారి సంక్షేమం కోసం పాటుపడ్డారని బాలకృష్ణ పేర్కొన్నారు. 

nandamuri balakrishna speech at ntr centenary celebrations in vijayawada ksp
Author
First Published Apr 28, 2023, 8:00 PM IST

పరిపాలనలో ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారని అన్నారు ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. శుక్రవారం విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారని పేర్కొన్నారు. పరిపాలన ఒకే చోట వుండేలా చర్యలు తీసుకున్నారని బాలయ్య ప్రశంసించారు. మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. గురుకుల ఆశ్రమ పాఠశాలలు సైతం, మహిళా పద్మావతి విశ్వ విద్యాలయం, తెలుగు గంగ ఇలా ఎన్నో ప్రాజెక్ట్‌లను తీసుకొచ్చారని బాలయ్య గుర్తుచేశారు. ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారున్నా వారి సంక్షేమం కోసం పాటుపడ్డారని బాలకృష్ణ పేర్కొన్నారు. 

తెలుగువారి ఆత్మ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేశారని.. అసెంబ్లీలో, రాజకీయ సభల్లో ఎన్నో ప్రసంగాలు యన్టీఆర్‌కే ప్రత్యేకమన్నారు. ఆయన తిరిగిన విజయవాడ గడ్డపై ఆ ప్రసంగాలు పుస్తకాలు గా ఆవిష్కరించడం ఆనందంగా ఉందని బాలయ్య అన్నారు. యన్టీఆర్‌ బిడ్డగా మాపై నేడు ఎంతో ఆదరణ, అభిమానం చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. యన్టీఆర్‌ నటన‌ చూసి  తెలుగు కళామతల్లి గల గల నవ్విందని బాలయ్య అన్నారు. అటువంటి నటధీరుడు , పాత్రలో పరకాయ ప్రవేశంతో నటనకే జీవం పోశారని ప్రశంసించారు. 

రాజకీయంగా కూడా ప్రతి తెలుగు వాడు తలెత్తుకుని తిరిగే తెగింపు, ఆత్మవిశ్వాసం ప్రజల్లో  కల్పించారని బాలకృష్ణ పేర్కొన్నారు. రాజకీయాలంటే ఆసక్తి లేని‌వారిలో రాజకీయ చైతన్యం తీసుకువచ్చారని కొనియాడారు. పేదలకు అవసరమైన కూడు, గూడు, నీడ అందించారని బాలయ్య పేర్కొన్నారు. కిలో రెండు రూపాయలు బియ్యం, జనతా వస్త్రాలు, పెన్షన్, భూమి శిస్తు రద్దు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేశారని తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios