ప్రత్యర్థి వైసిపి నాయకులతో కలిసి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. హిందూపురం వైసిపి కన్వీనర్ శ్రీరామ్ రెడ్డిని కూడా కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసారు.
కర్ణాటక: ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (nandamuri balakrishna) వ్యక్తిగత సహాయకుడు(PA)పేకాట ఆడుతూ అడ్డంగా బుక్కయ్యాడు. కర్ణాటకలోని చిక్కబళ్ళాపూర్ జిల్లా గౌరిబిదనూరు పట్టణ సమీపంలో భారీఎత్తున పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసులు దాడి చేసారు. ఈ దాడిలో చాలామంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వీరిలో కొందరు వైసిపి నాయకులతో పాటు బాలయ్య పీఏ బాలాజీ కూడా వున్నాడు.
గౌరిబిదనూరు పేకాట స్ధావరంపై దాడిలో లక్షాయాభై వేల నగదుతో పాటు సెల్ ఫోన్లు, వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతూ పట్టుబడిన వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసారు. బాలయ్య పీఏ, హిందూపురం (hindupuram) వైసిపి కన్వీనర్ శ్రీరామ్ రెడ్డితో పాటు మరికొందరు రాజకీయ నాయకులు, పన్నెండుమంది ఉపాధ్యాయులు కూడా పోలీసులకు పట్టుబడినవారిలో వున్నట్లు సమాచారం.
video
గతంలో పీఏగా పనిచేసిన శేఖర్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడమే కాదు తమకు అందుబాటులో వుండటం లేదంటూ టిడిపి (TDP) నాయకులు బాలయ్యకు ఫిర్యాదు చేసారు. పార్టీ కేడర్ నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో తన పీఏను మార్చారు బాలకృష్ణ. ఇలా ఐదేళ్ళ క్రితం శేఖర్ ను తొలగించి బాలాజీని పీఏగా నియమించుకున్నారు బాలయ్య. హిందూపురంలో ఆయన సంబంధించిన వ్యవహారాలను బాలాజీయే చూసుకుంటున్నాడు.
అయితే బాలాజీ నుండి కూడా బాలయ్యకు చిక్కులు తప్పడంలేదు. బాలకృష్ణ రాజకీయ ప్రత్యర్థులయిన హిందూపురం వైసిపి నాయకులతో కలిసి బాలాజీ పేకాట ఆడుతూ పట్టుబడ్డాడు. హిందూపురం వైసిపి కన్వీనర్ శ్రీరామ్ రెడ్డితో పాటు మరికొందరు వైసిపి నాయకులకు ఎమ్మెల్యే బాలయ్య పీఏ సన్నిహితంగా వుండటం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
కర్ణాటకలో ఓ బార్ ఆండ్ రెస్టారెంట్ లో భారీఎత్తున పేకాట ఆడుతున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు దాడిచేసారు. దీంతో 19మంది పేకాటరాయుళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వీరిలో రాజకీయ నాయకులే కాదు ఉద్యోగులు కూడా వున్నారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.
ఇదిలావుంటే ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో పేకాట దుమారం రేపింది. స్వయంగా రాష్ట్ర మంత్రి ఒకరు పేకాట ఆడుతున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు (errabelli dayakarrao) ప్రత్యర్థి కాంగ్రెస్ నాయకుడితో పాటు మరికొందరితో కలిసి పేకాట ఆడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో వుండి ప్రజాసమస్యలను గాలికి వదిలేసి ఇలా పేకాడటం ఏమిటని ప్రతిపక్షాలు మంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి.
ఇలాగే హైదరాబాద్ శివారులో ఓ విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో పేకాట ఆడుతుండగా కొందరిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఇలా పట్టుబడినవారిలో అధికార టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్యే కూడా వున్నట్లు... ఆయనను తప్పించి మిగతావారిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఇలా రాజకీయ నాయకులు సరదాకు పేకాట ఆడుతున్నామని అంటున్న చట్టాలు చేసేవారే ఇలా చట్టవ్యతిరేకచర్యలకు పాల్పడటంపై ప్రజలు విమర్శిస్తున్నారు.
