విజయవాడ: కింగ్ నాగార్జున రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా..?ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ఉవ్విళ్లూరుతున్నారా..?ఏపీ నుంచి పార్లమెంట్ లో అడుగుపెట్టాలని భావిస్తున్నారా..?వైసీపిలో చేరేందుకు నాగార్జున పావులు కదుపుతున్నారా..?

వైఎస్ కుటుంబంతో ఉన్న స్నేహమే అందుకు కారణమా..? అంటే అవునంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న నాగార్జున రాజకీయ రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యువ సామ్రాట్ అక్కినేని నాగార్జు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే నాగర్జున వైఎస్ జగన్ తో ఈ విషయంపై చర్చించారని అయితే గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నట్లు కింగ్ చెప్పారట. 

అయితే వైఎస్ జగన్ ముందు  పార్టీలో చేరాలని పార్టీ బలోపేతం కోసం కృషి చెయ్యాలని కోరారట. అయితే ఎక్కడ నుంచి పోటీ చెయ్యాలి..పార్లమెంట్ కు పోటీ చెయ్యాలా అసెంబ్లీకి పోటీ చెయ్యాలా అసలు టిక్కెట్ ఇస్తారా ఇవ్వరా అన్న అంశంపై జగన్ ఇప్పటి వరకు నాగార్జునకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. 

ఈ సార్వత్రిక ఎన్నికల్లోనే రాజకీయ ఆరంగేట్రం చెయ్యాలని నాగార్జున భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరితే తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని భావించిన నాగార్జున ఆదిశగా ప్రయత్నాలే చెయ్యడం లేదట. 

నాగార్జునకు సంబంధించి ఆస్తులన్నీ తెలంగాణలోనే ఉండటం, చంద్రబాబు నాయుడు అంటేనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఒంటికాలిపై యుద్ధానికి లేస్తున్నారు. ఇప్పటికే 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత తన ఆస్తులపై ప్రభుత్వం చేసిన దాడులు మరచిపోలేదు. 

ఈ నేపథ్యంలో సైకిలెక్కితే తనను ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తారని ఆందోళనతో ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అయితే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న సమయంలో అక్కినేని నాగేశ్వరరావు కుటుంబానికి వైఎస్ కుటుంబంతో మంచి అనుబంధం ఉండేది. 

వైఎస్ ఆర్ మరణానంతరం కూడా కింగ్ నాగార్జున అదే స్నేహాన్ని కుటుంబ మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే పలుమార్లు జగన్ ను కలిసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అలాగే నాగార్జున మేనల్లుడు సినీనటుడు సుమంత్ మంచి స్నేహితుడు వైఎస్ జగన్. 

ఇద్దరూ క్లాస్ మేట్స్ కావడంతో ఇద్దరూ తరచూ కలుస్తుంటారు. ఈ మధ్యకాలంలోనే సుమంత్ జగన్ తో చిన్న నాటి జ్ఞాపకాలను సైతం గుర్తు చేశారు. నాగార్జున వైసీపీలో చేరేందుకు సుమంత్ తో స్నేహం కూడా ఒక కారణంగా చెప్తున్నారు. 

వైఎస్ కుటుంబంతో స్నేహ బంధం ఉండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని కింగ్ నాగార్జున నిర్ణయించుకున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప  యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్రలు చేస్తున్నారు. ఫిబ్రవరి మెుదటి వారం లేదా రెండో వారంలో పాదయాత్రను ముగించాలని నిర్ణయించుకున్నారు. 

పాదయాత్ర తర్వాత స్వల్ప విరామం తీసుకుని తిరిగి జగన్ ప్రజలమధ్యే ఉండేందుకు మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాలని జగన్ ఆలోచిస్తున్నారట. 

ఫిబ్రవరి మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మెుదటి వారం లేదా రెండో వారంలో జగన్ పాదయాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. అనంతరం బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

వైఎస్ జగన్ పాదయాత్ర అనంతరం బస్సు యాత్ర చేపడతారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పాదయాత్ర ద్వారా కవర్ చెయ్యలేని ప్రాంతాలను బస్సు యాత్ర ద్వారా పర్యటించాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ బస్సు యాత్ర సమయంలోనే కింగ్ నాగార్జున వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న నేపథ్యంలో బస్సు యాత్ర అంతా అక్కినేని నాగార్జునే చూసుకుంటారని ప్రచారం జోరుగా సాగుతోంది. 

అదే కనుక నిజం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తారాబలం మాంచి సపోర్ట్ గా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికీ అలనాటి హీరోయిన్ ప్రస్తుతం నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. అటు సినీ ఇండస్ట్రీలో కీలక వ్యక్తిగా గుర్తింపు పొందని మంచు మోహన్ బాబు సైతం జగన్ కు జై కొడుతున్నారు.  

ఇటీవల వైఎస్ జగన్ పై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు మోహన్ బాబు. అంతేకాదు ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి నిష్పక్షపాతంగా కేసు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆతర్వాత జగన్ న ఇంటికి వెళ్లి పరామర్శించారు కూడా. 

అటు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగానే ఉంది. వైఎస్ బతికి ఉన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఆయనతో మంచి స్నేహంగా ఉండేవారు. ఇకపోతే కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆది శేషగిరిరావు ఇప్పటికే వైసీపీలో కీలక స్థానంలో ఉన్నారు. 

2019 ఎన్నికల్లో ఘట్టమనేని ఆది శేషగిరిరావు ఎన్నికల బరిలో నిల్చున్న ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని కూడా ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత సినీ దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళీ సైతం వైసీపికి జై కొట్టారు. 

అటు ప్రముఖ ఫోటోగ్రాఫర్ చోటా కె నాయుడు, హాస్య నటుడు పృథ్విరాజ్, ఫిష్ వెంకట్, అలనాటి హీరో భాను చందర్, సుమంత్ లు వైఎస్ జగన్ కు మద్దతు పలుకుతున్నారు. అంతేకాదు హీరో కృష్ణుడు సైతం వైసీపీ గూటికి చేరారు. 

గురువారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన వంచనపై గర్జన దీక్షలో పృథ్విరాజ్, కృష్ణుడులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీని తూర్పారబట్టారు. ఒకానొక దశలో పృథ్విరాజ్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం కూడా జరిగింది.  

వారి సరసన ఇప్పుడు కింగ్ నాగార్జున చేరబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఈ వార్తలు విపరీతంగా ట్రోల్ అవుతున్నా కింగ్ నాగార్జున ఖండించలేదు. దీంతో నాగార్జున వైసీపీలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలు నిజమేనని ప్రచారం జరుగుతుంది. 

మరి ఈ ప్రచారంపై నాగార్జున ఎలాంటి సమాధానం చెప్తారోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ నాగార్జున కూడా వైసీపీలోకి వస్తే జగన్ కు తారాబలం మరింత పెరిగే అవకాశం ఉంది. సినీనటులను కూడా ఉపయోగించి ఎన్నికల ప్రచారం హోరెత్తించే ఛాన్స్ కూడా లేకపోలేదు.