చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ ఎన్నికల్లో సందర్భంగా వైసీపీలో వర్గ విబేధాలు బయటపడ్డాయి. వైసీపీ నేత కేజే కుమార్ రెబల్ అభ్యర్ధులను బరిలోకి దింపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ఎమ్మెల్యే రోజా పోలీంగ్ కేంద్రం బయటే పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు.

రెబల్స్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలంటూ రోజా ముఖ్యమంత్రిని కోరారు. వ్యతిరేక వర్గాలను అణిచివేయాలని రోజా ఎన్నోసార్లు భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు.

పలుమార్లు ఆమె అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. అయితే అందరినీ కలుపుకుని పోవాలని హైకమాండ్ ఆదేశించడంతో ఆమె కూడా సయోధ్యకు వెళ్లారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేస్తుండటం పట్ల రోజా అసహనం వ్యక్తం చేశారు.

ప్రతి పోలింగ్ బూత్‌కు వెళ్లి.. కేజే కుమార్ నిలబెట్టిన రెబల్ అభ్యర్ధుల ఫోటోలను వీడియో తీస్తూ, దానిని సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. రెబల్ అభ్యర్థుల చర్యల కారణంగా టీడీపీ గెలిచే అవకాశం వుందని రోజా ఆందోళన వ్యక్తం చేశారు.

అంతకుముందు మీడియాతో మాట్లాడిన ఆమె.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు ప్రయత్నించినవారే మున్సిపల్ ఎన్నికల్లో కూడ పార్టీ అభ్యర్ధులను ఓడించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

నగరి అసెంబ్లీ నియోజకవర్గంలోని నగరి, పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను ఓడించేందుకు గాను రెబెల్స్ ను రంగంలోకి దింపారని రోజా మండిపడ్డారు. రెబెల్స్ అభ్యర్ధులకు మద్దతుగా లేఖలు, వీడియోల ద్వారా ప్రచారం చేస్తున్నారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఈ రెండు మున్సిపాలిటీల్లో టీడీపీ విజయం సాధించినా ఫర్వాలేదు, కానీ వైసీపీ అభ్యర్ధుల ఓటమికి రెబెల్స్ ప్రయత్నిస్తున్నారన్నారు. రెబెల్స్ గా రంగంలో ఉన్నవారికి పెద్ద ఎత్తున డబ్బులు అందించారని ఆరోపించారు.