టీడీపీ హయాంలో రెడ్లు తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నారని  ఎమ్మెల్యే రోజా అభిప్రాయపడ్డారు. కాగా... జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము సంతోషంగా ఉన్నామని ఆమె చెప్పారు.  వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఈ ఏడాది రెడ్డి కులస్థులు కార్తీక వనసమారాధనలను చాలా సంతోషంగా జరుపుకొంటున్నారని నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్‌కే రోజా అన్నారు. 

కాకినాడ సమీపంలోని అచ్చంపేటలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన వన సమారాధనలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. 

గత ఐదేళ్లలో రెడ్లను తొక్కిపెట్టి, తీవ్రంగా అవమానించారని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలకు టీడీపీ తీవ్ర అన్యాయం చేసిందని ఆమె అన్నారు. రెడ్లందరూ కష్టపడి వైసీపీని 151 సీట్లలో గెలిపించి జగన్మోహాన్‌రెడ్డిని సీఎం చేసుకుని గర్వంగా చెప్పుకొనేలా పనిచేశారన్నారు.

 ముఖ్యమంత్రి పదవి అంటే ఒక కుర్చీ కాదు. అది బాధ్యతాయుతమైన పదవని రోజా పేర్కొన్నారు.  చంద్రబాబు, జగన్‌ ఇద్దరూ రాయలసీమ నుంచి వచ్చిన వారేనని అయితే చంద్రబాబు దోచుకుతినడానికే ముఖ్యమంత్రి పదవి చేపట్టారని విమర్శించారు.  జగన్‌ రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఆ బాధను ముఖంలో కనబడనివ్వకుండా ప్రజల కష్టాన్ని దూరం చేసే విధంగా పాలిస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు.

 రెడ్డి అంటే ఒక కులం కాదని గుణం, ధైౖర్యం.. భరోసా అని వ్యాఖ్యానించారు. అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డే దీనికి నిదర్శనమని తెలిపారు.