హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ ప్రత్యర్థి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సినీ నటుడు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. కరోనా కారణంగా నష్టపోయిన సినీ పరిశ్రమకు జగన్ వరాలు ప్రకటించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సీఎం తన నిర్ణయంతో లాక్ డౌన్ వల్ల పరిశ్రమలో ఏర్పడిన శూన్యాన్ని పూడ్చారని ఆయన ప్రశంసించారు. 

ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఆపత్కాలంలో పరిశ్రమకు అండగా నిలిచినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం చొరవతో సినీ పరిశ్రమకు జవసత్వాలు ఒనగూరుతాయని ఆయన అన్నారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించారు. 

వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయమని ఆయన అన్నారు. విపత్కర సమయంలో ఉద్దీపన చర్యలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వానికి బిగ్ థాంక్స్ అని ఆయన అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ పూర్వ వైభవంతో వెలిగిపోయేందుకు ఇవి ఉపయోగపడుతాయని మహేష్ అన్నారు. సినిమా మళ్లీ ట్రాక్ లో పడుతుందని మహేష్ బాబు అన్నారు. 

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దర్శకుడు పూరీ జగన్నాథ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న ఎన్నో కుటుంబాలకు ఈ రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. ఇలాంటి గొప్ప నిర్ణయం వల్ల కోవిడ్ మహమ్మారితో చితికిపోయిన పరిశ్రమ తిరిగి నిలదొక్కుకుంటుందని ఆయన అన్నారు. 

 

సరైన సమయంలో స్పందించి వరాలు కురిపించిన జగనన్న చొరవ, నాయకత్వం అమోఘమని సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు.