Asianet News TeluguAsianet News Telugu

జగన్ గారూ... మళ్లీ పాదయాత్ర ఎందుకు చేయరు?: నాదెండ్ల మనోహర్

శుక్రవారం జనసేన రాష్ట్ర నేతలతో నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించి రోడ్ల దుస్థితిపై ఉద్యమించాలని నిర్ణయించారు. 

nadendla manohar questioned cm ys jagan over padayatra
Author
Amaravati, First Published Aug 27, 2021, 1:29 PM IST

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 3,600 కిలో మీటర్లు జగన్ పాదయాత్ర చేశారు... మరి ఇప్పుడు రోడ్ల దుస్థితిపై ఎందుకు పాదయాత్ర చేయరు? అని జనసేన పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాల్సిన బాధ్యత లేదా? అని నిలదీశారు. ప్రతిపక్షాలు, ప్రజలు ప్రశ్నించకుండా పోలీసులను అడ్డం పెట్టుకుని సిఎం జగన్ ముందుకు వెళుతున్నారని నాదెండ్ల మండిపడ్డారు.  

శుక్రవారం జనసేన రాష్ట్ర నేతలతో నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా జనసేన ఫర్ ఏపీ రోడ్స్ పేరుతో రోడ్ల పరిశీలన పోస్టర్ ని ఆవిష్కరించారు నాదెండ్ల. 

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... ఏపీలో ఎప్పుడూ ఇలాంటి దుస్థితి చూడలేదన్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారన్నారు. లక్షా 26వేల కిలో మీటర్ల రాష్ట్ర రహదారులు దెబ్బతిన్నాయని... ప్రజలు ఇబ్బందులు పడుతున్నా చలనం లేదన్నారు. 

read more  ఏపీలో తాలిబాన్లను మించిన అరాచకం... నేర రాజకీయాలపై పేటెంట్ వైసిపిదే: వర్ల సంచలనం

''రూ.12,450కోట్ల రూపాయలు రహదారులు బాగు కోసం కేటాయించారు. 1340 కోట్ల టెండర్లు పిలిచామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి పనులు ఎక్కడ... కాంట్రాక్టర్లు ఏరి? ఇది కూడా పెద్ద స్కాంగా మేము అనుమానిస్తున్నాం'' అన్నారు. 

''మంత్రులు, ప్రజాప్రతినిధులు నిత్యం ఇదే రోడ్లపై ప్రయాణిస్తున్నా గోతులు కనిపించడం లేదా? వాహన మిత్ర స్కీం పెట్టి పది‌వేలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఈ రోడ్ల వల్ల వాహనాలు దెబ్బ తిని మూడింతలు ఎక్కువ ఖర్చు అవుతుంది'' అని అన్నారు.

''మా కార్యకర్త ప్లకార్డు చేతబడితే కేసులు పెట్టారు. రోడ్ల పరిస్థితిపై వీడియోలు తీసి మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. సెప్టెంబర 2, 3, 4తేదీలలో ఈ వీడియోలు   ప్రదర్శిస్తాం. ఆ తరువాత ప్రభుత్వం స్పందించాలని నెల రోజుల పాటు వేచి చూస్తాం. అప్పటికీ స్పందించకుంటే అక్టోబర్ 2వ తేదీ నుండి జనసేన అధ్యక్షుడు నుంచి జన సైనికుల వరకు అందరూ రోడ్లను శ్రమదానంతో బాగు చేస్తాం.ప్రతి నియోజకవర్గం లో ఈ కార్యక్రమాలు వరుసగా ఉంటాయి. జనసేన ఫర్ ఏపీ రోడ్స్ పేరుతో రోడ్లను పరిశీలించి ప్రజలకు చూపిస్తాం'' అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios