పోలవరం ప్రాజెక్టు కోసం రూ.2,234.28 కోట్లను నాబార్డు శుక్రవారం జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్యూడీఏ)కు విడుదల చేసింది. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రీయింబర్స్‌మెంట్‌ కింద ఎన్‌డబ్యూడీఏ ఆ మొత్తాన్ని విడుదల చేయనుంది.

ఈ మొత్తాన్ని పోలవరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక ఖాతాలో ఒకట్రెండు రోజుల్లో జమ చేయనుంది.  కాగా 3, 4 రోజుల్లో నిధులు ఏపీ ప్రభుత్వ ఖాతాలో జమ కానున్నాయి. 

ఇప్పటివరకు రూ.8,507 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. ఇంకా రూ.1788 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన మాటలు నిజం కానున్నాయి. 

ఐదు రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మూడోరోజు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ 2021 నాటికి పూర్తి చేస్తామని...ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారంటూ చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.