విశాఖకు చెందిన మహిళా హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీకాంతం మరణం పలు అనుమానాలకు తావిస్తోంది. కమిషనరేట్ పరిధిలోని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల్లో పనిచేస్తున్న లక్ష్మీకాంతంను..  ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల డ్యూటీ వేశారు.

దీనిలో భాగంగా పోలింగ్ రోజు డ్యూటీకి వెళ్లేందుకు తెల్లవారుజామున తన ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఆమెను  మర్రిపాలెం జంక్షన్ వద్ద ఓ ఇన్నోవా కారు ఢీకొట్టడంతో లక్ష్మీకాంతం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

కాగా రోడ్డు ప్రమాదానికి కారణమైన ఇన్నోవా ముగ్గురిని ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఆ ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఎయిర్‌పోర్ట్ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి ఆ రోజు ఉదయం సీసీ కెమెరాల్లో రికార్డయిన ఆధారాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.

కాగా.. హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మీకాంతం రోడ్డు ప్రమాదంలో చనిపోయారా..? లేక ఉద్దేశ్యపూర్వంగా ఎవరైనా యాక్సిడెంట్ చేశారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు యశ్వంత్ అనే వ్యక్తిదిగా గుర్తించారు.

అయితే స్థానిక గాజువాక సుందరయ్య కాలనీకి చెందిన ఓ వ్యక్తి తానే ఆరోజు ఉదయం కారు నడిపానని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే పోలీసులు తమదైన శైలీలో విచారించడంతో యశ్వంతే కారు నడిపినట్లు అంగీకరించాడు.

వెంటనే అతడిని అదుపలోకి తీసుకుని విచారించగా .. ఏ మాత్రం పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. దీంతో ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆమెకు యశ్వంత్‌తో ఏమైనా విభేదాలున్నాయా.? లేక మరేవరైనా సూత్రధారులున్నారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.