పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. వింత వ్యాధి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బాధితుల సంఖ్య 20కి చేరింది. 

వింత వ్యాధి బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఇద్దరు బాధితులను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉన్నట్టుండి కళ్లు తిరిగి కింద పడిపోతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. 

అలా పడిపోయిన వారిలో కొందరికి ఫిట్స్ లక్షణాలు ఉన్నాయి. వైద్య అధికారులు అప్రమత్తమై వెంటనే గ్రామంలో 5 వైద్య బృందాలు ఏర్పాటుచేశారు. ఇంటింటికి వెళ్లి అధికారులు సర్వే చేస్తున్నారు. ఆశ వర్కర్లు గ్రామంలోని 6 నీళ్ల ట్యాంక్‌లో వాటర్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు. 
వింత వ్యాధి బాధితులను ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, కలెక్టర్ రేవు ముత్యాలరాజు, డీఎంహెచ్ఓ డాక్టర్ సునంద పరామర్శించారు. పూళ్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పరామర్శించనున్నారు. 

గతంలో ఏలూరులో ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాధితులంతా ప్రత్యేక చికిత్స పొందుతున్నారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నారని వైద్య అధికారులు చెబుతున్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.