విజయవాడ: రాయలసీమకు చెందిన సీనియర్ నాయకులు ఒక ఐదుగురు పేర్లు చెప్పండి అంటే ఆ ఐదుగురిలో ఆయన పేరు ఉండాల్సిందే. రాష్ట్ర రాజకీయాల్లో ఆరితేరిన నేతగా ఆయనకు మాంచి పేరుంది. ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ పైనే ఎక్కువగా గడుపుతూ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అంటుంటారు. 

ఇంకెవరు ఆయనే మైసూరారెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా రాయలసీమ రాజకీయాల్లో మైసూరారెడ్డి స్టైల్ వేరు. అయితే ఏ పార్టీలోనూ ఆయన ఎక్కువ కాలం ఇమడకపోవడం ఒక మైనస్ గా చెప్పుకుంటారు. రాజకీయాల్లో మేటి అయిన ఆయన ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన ఆయన కొంతకాలం స్తబ్ధుగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తిరిగి తన రాజకీయ భవిష్యత్తుని ఎలా ఎక్కడ నుంచి మెుదలు పెట్టాలో తెలియక అపసోపాలు పడుతున్నారు. 

అయితే జనసేన పార్టీకి వెళ్లాలని మైసూరారెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తుని పునర్నిర్మించుకోవడానికి జనసేన పార్టీని ఎంచుకున్నారని, త్వరలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.  

ఇకపోతే మైసూరారెడ్డికి రాష్ట్ర రాజకీయాలతోపాటు ముఖ్యంగా రాయలసీమ రాజకీయాల్లో మంచి పట్టుంది. రాయలసీమ వెనుకబాటుతనం, రాయల సీమ అభివృద్ధి, నేతల వైఖరిపై మంచి అవగాహక కలిగిన వ్యక్తి. 

అయితే మైసూరారెడ్డి ఒక అడుగు ముందుకు వెస్తే నాలుగు అడుగులు వెనక్కి వెళ్తుంటారని చెప్పుకుంటూ ఉంటారు. అది ఎలా జరిగిందో ఓసారి చూస్తే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా మైసూరారెడ్డి ఉండేవారు. అయితే అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో విబేధించి 2004కి ముందు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. 

ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యత్వం పూర్తవుతున్నా తన రాజకీయ భవిష్యత్ పై చంద్రబాబు నాయుడుపై ఎలాంటి వైఖరి స్పష్టం చెయ్యకపోవడంతో ఆయన టీడీపీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

వైఎస్ జగన్ జైలుకు వెళ్లిన సమయంలో జగన్ కు తోడుగా పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చక్కదిద్దేవారు. అయితే జగన్ జైలు నుంచి బయటకు రావడం మైసూరారెడ్డి పార్టీ వీడటం రెండూ వెంటవెంటనే జరిగిపోయాయి. 

మైసూరారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం వస్తుందని ఆశించారు. అయితే జగన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో ఆయన ఇక్కడ వర్కవుట్ అయ్యేటట్లు కనబడటం లేదని బయటకు వచ్చేశాడు. అయితే ఆ తర్వాత  వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇచ్చారు. 

అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న మైసూరారెడ్డి ఇటీవలే తెలంగాణ వెనుకబాటు తనం, సాగు తాగునీరుపై ప్రెస్మీట్లు పెట్టి హల్ చల్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుకు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లకు లేఖలు రాశారు. రాయలసీమ వెనుకబాటు తనానికి మీరే కారణం అంటూ ఆరోపించారు. 

తాజాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇక ఏదో ఒక పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. దీంతో జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో కండువాకప్పుకోనున్నారు మైసూరారెడ్డి. మైసూరారెడ్డి రాజకీయ అనుభవం రాయలసీమలో పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని జనసేన పార్టీ కూడా భావిస్తోంది.