ఈ ఆలయంలో రైతు భరోసా, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి లాంటి పథకాల పేరుతో భారీ స్థూపాలు కూడా నిర్మించారు. వీటితో పాటు పేదలకు ఇళ్లు, ఫీజు రియింబర్స్ మెంట్, జలయజ్ఞం పథకాల పేరుతో స్థూపాలను ఏర్పాటు చేశారు. నవరత్నాల సృష్టికర్త అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

చిత్తూరు : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ఓ ఎమ్మెల్యే అభిమానం చాటుకున్నాడు. వినూత్నంగా చేసిన ఆయన ప్రయత్నం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి ఏకంగా తమ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ కు గుడి కట్టి తన ప్రేమను చాటుకున్నాడు. ఆ గుడికి నవరత్నాలు అని పేరు కూడా పెట్టాడు. 

ఈ ఆలయంలో రైతు భరోసా, పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి లాంటి పథకాల పేరుతో భారీ స్థూపాలు కూడా నిర్మించారు. వీటితో పాటు పేదలకు ఇళ్లు, ఫీజు రియింబర్స్ మెంట్, జలయజ్ఞం పథకాల పేరుతో స్థూపాలను ఏర్పాటు చేశారు. నవరత్నాల సృష్టికర్త అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఈ ఆలయాన్ని ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి సుమారు రూ. 2 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఎక్కడా లేని పథకాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారన్నారు. తన అభిమాన నాయకుడిమీద ప్రేమతో ఇలా అభిమానాన్ని చాటుకుంటున్నానని ఎమ్మెల్యే అంటున్నారు. 

తల్లిదండ్రులు, భార్యా పిల్లల కన్నా తనకు జగనే ముఖ్యమన్నారు ఎమ్మెల్యే. రాముడికి హనుమంతుడు ఎలాగో జగన్ కు తాను అలాగే అన్నారు. మొదటిసారి ఓడిపోయిన తనకు మళ్లీ టికెట్ ఇచ్చి జగనన్న గెలిపించారని, ఆయన మీద ఉన్న అభిమానాన్ని చాటుకునేందేకే ఈ నవరత్రాల ఆలయం నిర్మించానన్నారు. సంక్షేమ పథకాలతో పేదలు ఎంతో ఆనందంగా ఉన్నారని, ఏదో ఉదతా భక్తిగా ఇలా ఆలయాన్ని కట్టిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.