సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానంతో ఆమెను, ఆమె తల్లిని హత్య చేసిన ఓ వ్యక్తికి చిత్తూరు కోర్టు ఉరిశిక్ష విధించింది.
చిత్తూరు : ఓ మహిళతో వివాహేతర సంబంధంపెట్టుకోవడమే కాకుండా.. ఆమెను, ఆమె తల్లిని దారుణంగా హత్య చేసిన నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. 2021లో జరిగిన ఈ ఘటనపై చిత్తూరు జిల్లా మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎస్ రమేష్ ఈ సంచలన తీర్పును మంగళవారం నాడు వెలువరించారు. ఈ కేసుకు సంబంధించి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి లోకనాథరెడ్డి ఈ మేరకు వివరాలు తెలిపారు.
సయ్యద్ మౌలాలి (47) అనే నిందితుడు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం గంగిరెడ్డి పల్లెకు చెందిన వ్యక్తి. అతను అదే గ్రామంలోని సరళమ్మ అనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇలాంటి విషయాలు వెంటనే పుకార్లుగా గ్రామంలో పొక్కుతాయి. అలా అందరికీ విషయం తెలిసిపోవడంతో.. సరళమ్మను, ఆమె ముగ్గురు సంతానాన్ని, ఆమె తల్లి గంగులమ్మను మౌలాలి అదే మండలంలోని ఏటిగడ్డ తండాలో ఓ అద్దె ఇల్లు తీసుకుని అక్కడ ఉంచాడు.
తల్లీ, కూతుర్లతో సహజీవనం, హత్య.. కరోనా పేరు చెప్పి...
ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత మౌలాలికి సరళమ్మ మీద అనుమానం వచ్చింది. ఆ తర్వాత ఆమెను కర్రతో కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని తీసుకెళ్లి పెద్దేరు ప్రాజెక్టులో చెట్టుకు కట్టేశాడు. కూతురు కనిపించకపోవడంతో మౌలాలిని నిలదీసింది గంగులమ్మ. దీంతో కోపానికి వచ్చిన మౌలాలి గంగులమ్మను కూడా హత్య చేసి మృతదేహాన్ని ఓ చెరువులో కట్టేశాడు.
ఆ తర్వాత సరళమ్మ ముగ్గురు పిల్లలను భయపెట్టాడు. వారిని తీసుకుని కర్ణాటకలోని గౌనిపిల్లిలో అద్దె ఇంట్లో ఉంచాడు. సరళమ్మ అమ్మ ముగ్గురు సంతానంలో ఇద్దరు అమ్మాయిలు, ఒకరు అబ్బాయి. ఇద్దరు అమ్మాయిల్లో ఒకరి మీద అత్యాచారానికి కూడా పాల్పడ్డాడు.
మరోవైపు గంగులమ్మ ఆచూకీ తెలియకపోవడంతో ఆమె బంధువులు వెతకడం ప్రారంభించారు. అలా 2021 జనవరి 23న గంగులమ్మ బంధువు ధనమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని మీద దర్యాప్తు చేయగా ఈ దారుణమైన ఘటన వెలుగు చూసింది. దీనిమీద దర్యాప్తు జరుగుతుండగానే నిందితుడు భయపడి స్థానిక వీఆర్వోకు హత్యల గురించి తెలిపాడు. వెంటనే వీఆర్వో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు.
అలా మౌలాలిని 2021 జనవరి 29న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, హత్య నేరాల కింద కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరపరిచారు. అతను చేసిన నేరం రుజువు కావడంతో తాజాగా ఉరిశిక్ష విధించారు. దీంతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధించారు. కాగా నిందితుడు ఇప్పటికే ఫోక్సో కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు.
