కర్నూల్: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే తమ్ముడు, ఎమ్మెల్సీ తనయుడిపై పట్టపగలే హత్యాయత్నం జరిగింది. కొందరు వ్యక్తులు రెండు వాహనాల్లో వచ్చి ఎమ్మెల్సీ తనయుడిని కర్రలు, రాళ్లతో అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈ  ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. 

కర్నూల్ జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి కుటుంబంతో కలిసి నంద్యాలలో నివాసముండే విషయం తెలిసిందే. ఆయన పెద్ద కుమారుడు గంగుల బిజేంద్రా రెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే. చిన్న కొడుకు ప్రహ్లాద్ రెడ్డి కుటుంబ వ్యాపారాలను చూసుకుంటున్నాడు. 

read more  బెజవాడ కమీషనరేట్ ఉద్యోగి హత్య: మహేశ్‌‌ కారు లభ్యం, నిందితుల కోసం వేట

వ్యాపార వ్యవహారాల్లో భాగంగా ఆర్థిక లావాదేవీల్లో ప్రహ్లాద్ రెడ్డి కొందరు వ్యక్తులతో తేడాలు వచ్చాయి. దీంతో పగ పెంచుకున్న వారు అదును చూసి అతడిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రహ్లాద్ రెడ్డి ఒంటరిగా వెళుతున్నట్లు తెలుసుకున్న దుండగులు రెండు వాహనాల్లో తమ మనుషులతో వచ్చి అతడిపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రహ్లాద్ తీవ్రంగా గాయపడ్డారు. 

అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రమాదం తప్పింది. తనపై దాడికి పాల్పడింది సుధాకర్ రెడ్డి, మణికంఠ అనే వ్యక్తులని ప్రహ్లాద్ వెల్లడించినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు ఆర్థిక లావాదేవీలే ఇందుకు కారణమని అనుమానిస్తున్నారు.