ఏపీ సీఎం వైఎస్ జగన్ కాలిమడమ నొప్పికోసం సోమవారం వైద్యపరీక్షలు చేయించుకున్నారు. దీనికోసం విజయవాడలోని ఓ డయాగ్నోస్టిక్ ల్యాబ్ కు వెళ్లారు.
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కొద్దిరోజులుగా కాలి మడమ నొప్పితో బాధపడుతున్నారు జగన్. నొప్పికి చికిత్సలో భాగంగా విజయవాడలోని డయాగ్నోస్టిక్ ల్యాబ్లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. విజయవాడ మొగల్రాజపురం లోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్ కు సోమవారం మధ్యాహ్నం వైయస్ జగన్ వచ్చారు.
ఇక్కడ ముఖ్యమంత్రికి ఎంఆర్ఐ స్కాన్ తో పాటు వివిధ రకాల రక్త పరీక్షలు చేసినట్లు సమాచారం. పరీక్షల నిమిత్తం వైయస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు రెండు గంటల పాటు డయాగ్నోస్టిక్ లాబ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం ఒంటిగంటకు అక్కడికి చేరుకున్న సీఎం తిరిగి మూడు గంటల సమయంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి తిరిగి వెళ్లారు. వైఎస్ జగన్ వెంట ఆయన సతీమణి భారతీ రెడ్డి ఉన్నారు.
