వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసేవన్నీ చౌకబారు ట్వీట్లు అంటూ బీజేపీ నేత, ఎంపీ సుజనా చౌదరి అన్నారు.  రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి వేరే ప్రాంతానికి వైసీపీ ప్రభుత్వం మార్చేస్తోందంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. తాము రాజధానిని మారుస్తామని ఎక్కడా అనలేదని వైసీపీ అంటుంటే... బొత్స మాటలకు అర్థమేమిటంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్స్ కి కేశినేని, సుజనా చౌదరిలు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

‘‘అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకే ముంపుకు గురిచేశారని గగ్గోలు పెడుతున్నవారెవరో గమనించారా? చంద్రబాబు, సుజనా, కేశినేని, సిఎం రమేశ్, లోకేశ్, కోడెల, ఉమ, వీళ్ల బినామీలు, “కావాల్సిన” వాళ్లు వేల ఎకరాల భూములు రైతులను మోసం చేసి కొన్నారు. రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయన్నదే వీరి ఏడుపు.’’ అంటూ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు.

కాగా.. ఈ ట్వీట్ కి టీడీపీ ఎంపీ కేశినేని నాని, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిలు స్పందించారు. ‘‘విజయ సాయి రెడ్డి గారు నాకు గాని నా కుటుంబానికి కాని నాకు సంబంధించిన వారికి కాని అమరావతి లో ఒక్క అంగుళం భూమి  వుందని రుజువు చేస్తే ప్రభుత్వానికి వ్రాసి ఇస్తా లేకుంటే మీరేమి చేస్తారో కొంచం చెబుతారా’’ అంటూ కేశినేని నాని విజయసాయి రెడ్డికి బదులు ఇచ్చారు. కాగా సుజనా చౌదరి మాత్రం ఇంకాస్త గట్టిగానే స్పందించారు.

‘‘మీ చౌకబారు ట్వీట్లకు స్పందించాల్సి వస్తుందని ఇప్పటివరకు అనుకోలేదు.1910 నుంచి 2010 మధ్యలో వంశపారంపర్యంగా, ఇతరత్రా జరిగిన రిజిస్ట్రేషన్లు మినహా నాకు, నా కుటుంబానికి అమరావతిలో సెంటు భూమి వుందని నిరూపిస్తే అప్పుడు తగిన విధంగా స్పందిస్తా. మీ పదవి ప్రతిష్ఠను దిగజార్చకండి ’’ అని సుజనా ట్వీట్ చేశారు. మరి వీటికి విజయసాయి ఎలా స్పందిస్తారో చూడాలి.