ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మరోసారి లేఖ రాశారు. ఇప్పటికే.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ..  రఘురామ తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సొంత పార్టీపై విమర్శలు చేస్తూ.. ఆయన తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. కాగా.. తాజాగా.. సరికొత్త అంశమై.. జగన్ కి లేఖ రాశారు.

ఆగస్టు 5న అయోధ్యలో  జరిగే భూమి పూజ కార్యక్రమం రోజు రాష్ట్రంలోని  అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని రఘురామ లేఖలో కోరారు. ‘దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆద్వర్యంలోని 24 వేల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, వేద పఠనం నిర్వహించాలి. భూమి పూజ కార్యక్రమాన్ని టీటీడీ ఆద్వర్యంలోని ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయాలి. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రధానమంత్రి మోడీ ఆగష్టు 5న చేస్తున్న భూమి పూజ భారతదేశ చరిత్రలో ఒక  మైలురాయి. ప్రజలు చిరకాల వాంఛ అయోధ్యలో రామాలయం నిర్మాణం.’ అంటూ లేఖలో రఘురామ పేర్కొన్నారు.