న్యూడిల్లీ: విజయనగరం రాజవంశీకుల మధ్య ఆదిపత్యం, అధికారం కోసం ప్రస్తుతం వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. వైసిపి ప్రభుత్వం మాజీ కేంద్ర మంత్రి, టిడిపి నాయకులు అశోక గజపతిరాజును తొలగించి సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌అశోక సైన్సెస్‌(మాన్సాస్‌) ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమించినప్పటి నుండి రాజవంశంలో అలజడి మొదలయ్యింది. 

అయితే ఇప్పుడిలా గొడవలతో రోడ్డునపడ్డ రాజవంశీకులపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గతంలో ఈ వంశం ఎలా వెలుగొందిందో తెలియజేసే ఓ సంఘటన గురించి రఘురామ కృష్ణంరాజు సోషల్ మీడియా వేదికన బయటపెట్టారు. 

రఘురామ కృష్ణంరాజు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ యధావిధిగా:

అది 1920వ సంవత్సరం. ఉత్తర భారతంలోని సంపన్న కుటుంబానికి చెందిన ఒకాయన, దక్షిణ భారతంలోని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సంపన్న కుటుంబానికి చెందిన మరొకాయనకు విమానం కొనుగోలు చేయాలనే తలంపు కలిగింది. అనుకున్నదే తడవుగా ఇద్దరు ఇంగ్లాండ్ పయనమయ్యారు. ఇద్దరు చెరో విమానాన్ని కొనుగోలు చేశారు. ఆ విమానాల్లో దర్జాగా ఇండియా తిరిగి వచ్చారు. ఉత్తర భారతానికి చెందిన ఆసామీ తాను కొనుగోలు చేసిన విమానాన్ని ప్రయాణికుల కోసం విమాన సర్వీసును ఏర్పాటు చేశాడు. రెండో ఆయన మాత్రం తాను కొనుగోలు చేసిన విమానాన్ని తన సొంతానికి వినియోగించుకున్నాడు.

ప్రయాణికుల కోసం విమాన సర్వీసు ప్రారంభించిన వ్యక్తి జంషెడ్‌ జీ టాటా కాగా... విమానంపై మక్కువతో తమ సొంతానికి ఉపయోగించుకున్న వ్యక్తి అలక్ నారాయణ గజపతి. ఈ అలక్ నారాయణ్ ఎవరో కాదు.... ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయనగరం ఎంపీ, టీడీపీ నేత అశోక్ గజపతి రాజుకి స్వయాన తాతయ్య.

1978లో రాజకీయాల్లోకి ప్రవేశించిన అశోక్ గజపతి రాజు ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. అయితే 2004లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కె.వీరభద్రస్వామి చేతిలో ఓటమి చవి చూశారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో గెలుపొందారు. ఇక 2014 ఎన్నికల్లో విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా అశోక్ గజపతి రాజు విజయం సాధించారు. మొదటిసారి ఎంపీగా విజయం సాధించడమే కాకుండా మోడీ కేబినేట్లో పౌర విమానాయ శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు బాధ్యతులు చేపట్టారు. దాంతో అనగనగా ఓ రాజుగారికి మంత్రి పదవి దక్కింది.