ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా తయారైన రఘురామకృష్ణంరాజు తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మరో లేఖాస్త్రాన్ని సంధించారు. త్వరలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో.... రఘురామ ఈ లేఖ రాసారు. 

పార్లమెంటు సమావేశాలు త్వరలో ప్రారంభమవనున్న నేపథ్యంలో.... లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల సమావేశం ఏర్పాటు చేయాలని తన లేఖలో విజ్ఞప్తి చేసారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. 

పార్లమెంటులో వాణిని ఎలా వినిపించాలి, అక్కడ ఏయే అంశాలు లేవనెత్తాలి, ఎలా స్పందించాలి వంటి అంశాలపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని, అందుకోసం సమావేశం ఏర్పాటు చేయాలనీ ఆయన తన లేఖలో కోరారు. 

కరోనా పరిస్థితుల దృష్ట్యా వెంటనే ఒక వర్చువల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన విన్నవించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని తన లేఖలో పేర్కొన్నారు. 

పెండింగులో ఉన్న కొన్ని అంశాలు ఇంతవరకు కేంద్రం దృష్టికి కూడా రాలేదని... ఇందుకు అధికారుల అలసత్వమే ప్రధాన కారణమని లేఖలో తెలిపారు రఘురామ. ఏ అంశాలను పార్లమెంటులో లేవనెత్తాలి అనే విషయంపై నోట్‌ను ముందే అందజేయాలని ఆయన కోరారు. 

సమావేశాలకు ముందు ఎప్పటినుండో కూడా ముఖ్యమంత్రులు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సమావేశం ఏర్పాటు చేయడం ఆనవాయిగా వస్తుందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈసారి అన్ని పార్టీలకు చెందిన ఎంపీలను ఆహ్వానించాలని... రాష్ట్ర శ్రేయస్సు, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో రఘురామ జగన్ మోహన్ రెడ్డిని కోరారు.