విజయవాడ: ఎన్నికల రణరంగం సమీపిస్తున్న తరుణంలో ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ తెరపైకి వచ్చింది. అరకు ఎంపీ కొత్తపల్లి గీత జనజాగృతి అనే కొత్త  పార్టీని స్థాపించారు. మార్పు కోసం ముందడుగు అనే నినాదంతో పార్టీని స్థాపించినట్లు తెలిపారు. పార్టీ జెండాను కూడా ఆమె విడుదల చేశారు. 
నీలం రంగు, తెలుపు రంగుతో కూడిన జెండాపై గొడుగు చిహ్నాన్ని ముద్రించారు.  

 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున అరకు పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. గెలిచినప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్న ఆమె తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా రాజకీయ పార్టీని స్థాపించడం చర్చనీయాంశంగా మారింది.

తాను డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశానని, నాలుగున్నరేళ్లు ఎంపీగా ఉన్నానని, విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహతో ఉన్నానని అందుకే పార్టీ పెడుతున్నట్లు తెలిపారు. గత నాలుగున్నరేళ్లుగా గిరిజన ప్రాంత సమస్యల్నిపార్లమెంట్‌లో ప్రస్తావించానని స్పష్టం చేశారు. 

రాజకీయ పార్టీలున్నది ప్రజల కోసమేనని ఎంపీ గీత తెలిపారు. మరోవైపు ప్రతిపక్ష నేత జగన్‌పై విమర్శలు గుప్పించారు. జగన్ అసెంబ్లీకి వెళ్లరని, ప్రజల సమస్యలు ప్రస్తావించరని విమర్శించారు.