కూతురిని భర్త నష్టజాతకురాలు అనడాన్ని జీర్ణించుకోలేని ఓ వివాహిత బిడ్డతో సహా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా మద్దికెర గ్రామానికి చెందిన జంగిరెడ్డి, లావణ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వీక్షిత సంతానం.

ఇద్దరు మగపిల్లలు తర్వాత పుట్టిన వీక్షితను తల్లి అల్లారుముద్దుగా పెంచేది. అయితే పాప పుట్టినప్పటి నుంచి తనకు కలిసి రావడం లేదని.. నష్టజాతకురాలైన పాపను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోవాలంటూ జంగిరెడ్డి గత కొద్దిరోజులుగా లావణ్యను వేధిస్తున్నాడు.

ఇతనికి తోడుగా జంగిరెడ్డి అక్కలు జంగమ్మ, జానకి కూడా లావణ్యను సూటిపోటి మాటలతో వేధించేవారు. ఈ వేధింపులు తట్టుకోలేక తాను పుట్టింటికి వచ్చేస్తానని లావణ్య తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ నెల 27న పెద్దల ముందు పంచాయతీ పెట్టించారు.

అల్లుడికి, కూతురికి నచ్చజెప్పి పంపించారు. అయినప్పటికీ భర్త ప్రవర్తనంలో మార్పు రాకపోవడంతో ఆదివారం రాత్రి లావణ్య తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి కన్నీరుమున్నీరైంది. అర్ధరాత్రి దాటిన తర్వాత బిడ్డను తీసుకుని ఊరి చివరన ఉన్న బావిలో దూకి లావణ్య ఆత్మహత్య చేసుకుంది.

సోమవారం తల్లిబిడ్డల మృతదేహాలను గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. లావణ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు జంగిరెడ్డి, అతని అక్కలు, బావలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లీబిడ్డల మరణంతో గ్రామంలో విషాద వాతావరణం చోటు చేసుకుంది.