పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు బిడ్డలను చంపి, తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. మొగల్తూరు గాంధీబొమ్మల సెంటర్ సమీపంలో నివసిస్తున్న నల్లిమిల్లి లక్ష్మీప్రసన్న, భర్తతో పాటు తన ఇద్దరు బిడ్డలతో కలిసి జీవిస్తోంది.

భర్త వెంకట రామాంజనేయరెడ్డికి రైస్ మిల్లు ఉండటంతో దానిని పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 7.15 గంటల సమయంలో ఇంటికి వచ్చిన రామాంజనేయ రెడ్డికి భార్య లక్ష్మీప్రసన్న ఫ్యాన్‌కు ఉరేసుకుని, మంచంపై ఇద్దరు పిల్లలు విగత జీవులుగా పడివుండటాన్ని చూసి కుప్పకూలిపోయాడు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, రామాంజనేయ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. గదిలో పరిస్థితిని బట్టి ముందు పిల్లల గొంతులను తువ్వాలుతో బిగించిన లక్ష్మీప్రసన్న.. ఆ తర్వాత అదే గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.

అయితే లక్ష్మీప్రసన్న ఇంట్లో ఆదివారం జరిగిన పెద్ద గొడవే కారణమని తెలుస్తోంది. కొన్ని నెలలుగా భర్త వేధింపులే ఈ గొడవకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. 10 రోజుల క్రితం రామాంజనేయరెడ్డి తల్లి రామలక్ష్మీ చనిపోవడంతో.. ఆమె పెద కర్మ ఆదివారం జరిగింది.

ఈ సందర్భంలో లక్ష్మీప్రసన్నతో భర్త సోదరిలు గొడవ పడినట్లు మృతురాలి తల్లి చెబుతున్నారు. సోమవారం ఇంట్లో శాంతిహోమం నిర్వహించిన అనంతరం.. సాయంత్రం 6 గంటలకు రామాంజనేయ రెడ్డి రైస్ మిల్లుకు వెళ్లాడు.

సాయంత్రం వచ్చి చూడగానే భార్యాపిల్లలు మరణించి ఉన్నారని అతను చెబుతున్నాడు. మరోవైపు అల్లుడికి ఉన్న అప్పులు, వేధింపులే తమ కుమార్తె ప్రాణం తీశాయని లక్ష్మీప్రసన్న తల్లి చెబుతున్నారు.

రామంజనేయరెడ్డి తండ్రి చనిపోయే నాటికే మిల్లుపై రూ.7 కోట్ల అప్పులు చేశారని చెప్పారు. నాటి నుంచి డబ్బులు తేవాలని, లేకుంటే నిన్ను చంపి మరో పెళ్లి చేసుకుంటానని తరచూ తన కుమార్తెను వేధింపులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు.

ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం రూ.70 లక్షలు వరకు అందజేశామని, అయినా తమ కుమార్తెపై అల్లుడు, అతని బంధువులు గొడవ పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే స్థానికుల వాదన మరోలా ఉంది..

లక్ష్మీప్రసన్న కుటుంబం 15 ఏళ్లుగా ఇదే ఇంట్లో అద్దెకు ఉంటోందని, గొడవలు జరుగుతున్నట్లు గానీ, ఆర్ధిక ఇబ్బందులు ఉన్నట్లుగా గానీ బయటకు రానిచ్చే వారు కాదని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతానికి అనుమానాస్పద మృతులుగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.