పుట్టింట్లో వేడుక అని సంబరంగా వెళ్లింది. ఆ సంబరం ఎక్కువ సేపు నిలవలేదు. ప్రమాదవశాత్తు కూతురు ప్రాణాలు కోల్పోగా.. కూతురిని ఆ స్థితిలో చూసి తల్లి కూడా కన్నుమూసింది. ఈ విషాదకర సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో పూడి రాంబాబు కొత్త ఇళ్లు నిర్మించుకున్నారు. ఆ ఇంటికి బుధవారం రాత్రి గృహ ప్రవేశం నిర్వహించారు. ఈ వేడుకకు రాంబాబు కుమార్తె బల్లే సరిత(21) అత్తింటి నుంచి వచ్చింది. గురువారం బంధువులకు విందు ఏర్పాటు చేశారు.

శుక్రవారం తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు సరిత మరుగుదొడ్డికి వెళ్లింది. అలా వెళ్లిన ఆమె ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. వెంటనే బాత్రూమ్ తలుపులు పగలగొట్టిచూడగా.. సరిత అపస్మారక స్థితిలో కనపడింది. కూతురిని అలా చూసిన ఆమె తల్లి వరలక్ష్మీ వెంటనే గుండె నొప్పితో ప్రాణాలు కోల్పోయింది.

కాగా... వర లక్ష్మి చనిపోయిన కొద్ది నిమిషాలకే సరిత కూడా ప్రాణాలు విడిచింది. దీంతో.. వారి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. సరిత బాత్రూమ్ లో జారి పడి తలకు దెబ్బ తగిలిందని అందుకే చనిపోయిందని.. ఇక వరలక్ష్మి హార్ట్ పేషెంట్ అని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.