హైదరాబాద్‌: బిగ్ బి అమితాబ్ పై ప్రశంసల జల్లు కురిపించారు జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కళ్యాణ్. అమితాబ్ బచ్చన్ అంటే తనకు ఎంతో ఇష్టమని పదేపదే చెప్పే పవన్ సైరా నరసింహారెడ్డి సినిమా సెట్స్ లో కలిశారు. 

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ తో కలిసి పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్.  

 

అమితాబ్ తో దిగిన ఫొటోలను ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్న పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఈ క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నా ఆరాధ్యమూర్తి అమితాబ్‌ బచ్చన్‌ని ‘సైరా’ సెట్స్‌లో కలిశాను. ఎన్ని సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని ఆయన జీవితం మనకు నేర్పుతుందంటూ చెప్పుకొచ్చారు. 

ఇకపోతే సైరా సినిమాకు పవన్‌ కళ్యాణ్ వాయిస్‌ ఓవర్‌ అందించిన సంగతి తెలిసిందే. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ మెగాస్టార్ చిరంజీవికి గురువుగా కీలక పాత్ర పోషించారు. అక్టోబర్‌ 2న ఈచిత్రం విడుదల కానుంది. 

మరోవైపు శిల్పకళావేదికలో జరిగిన మెగాస్టార్ చిరంజీవి 64వ జన్మదినోత్సవ వేడులకు హాజరైన పవన్ కళ్యాణ్ అదే వేదికపై తన సోదరుడు చిరంజీవితోపాటు బిగ్ బి అమితాబ్ పైనా ప్రశంశలు కురిపించారు. తనకు మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్ లు స్ఫూర్తిప్రధాతలు అంటూ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.