అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యకర్తలు స్లీపర్ సెల్సులాగా పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆరోపించారు. కొత్త ప్రాంతాలకు కరోనా వైరస్ ను వ్యాప్తి చేయడానికి టీడీపీ కార్యకర్తలు కుట్ర చేస్తున్నారని ఆయన సోమవారం మీడియా సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. 

ఇబ్బందులు లేని ప్రాంతాల్లో కూడా కేసులు బయటపడుతుండడాన్ని బట్టి టీడీపీ కుట్ర చేస్తున్నారనే అనుమానం కలుగుతోందని, టీడీపీ అధినేత ఎంత వరకైనా దిగుజారుతారని, జగన్ ప్రభుత్వాన్ని దెబ్బ తీయడానికి స్లీపర్ సెల్స్ లాగా కొంత మందిని పంపించారా అనే అనునమానం కలుగుతోందని ఆయన అన్నారు. 

గవర్నర్ హరిచందన్ కు బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాయడదం కూడా కుట్రలో భాగమేనని ఆయన అన్నారు. ఎస్ఈసీగా ప్రమాణ స్వీకారం చేయడానికి కనగరాజ్ రావడం వల్లనే రాజ్ భవన్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు చోటు చేసుకున్నాయని అనడం చిల్ల రాజకీయమేనని, దీన్ని బట్టి టీడీపీ నేతలు ఎంతకైనా దిగజారగలరనేది అర్థమవుతోందని ఆయన అన్నారు. 

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1177కు చేరుకుంది. వీరిలో ఇప్పటి వరకు 235 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 31 మంది మరణించారు. 

గత 24 గంటల్లో గుంటూరు జిల్లాలో 23, కృష్ణా జిల్లాలో 33, కర్నూలు జిల్లాలో 13, నెల్లూరు జిల్లాలో 7, శ్రీకాకుళం ఒక కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కేసుల నమోదులో 292 కేసులతో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుంటూరు జిల్లా 237 కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది.