ఇటీవలే స్త్రీ శిశు సంక్షేమ శాక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ కు వింత అనుభవం ఎదురయ్యింది. కసాపురం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లిన మంత్రి ఒళ్లో ఓ వానరం కూర్చుంది.
అనంతపురం: ఇటీవల మంత్రిగా నూతన బాధ్యతలు స్వీకరించిన ఉషశ్రీ చరణ్ (ushasri charan) కు వింత అనుభవం ఎదురయ్యింది. స్త్రీ శిశు సంక్షేమ శాఱ మంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉషశ్రీ మొదటిసారి సొంత నియోజవర్గం కళ్యాణదుర్గంలో పర్యటించారు. ఈ క్రమంలోనే కసాపురం ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రితో పాటు అనుచరులు, టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆలయంవద్దకు చేరుకోవడంతో కోలాహలం నెలకోంది. భారీ అనుచరగణంతో ఆలయంలోకి వెళ్లిన ఉషశ్రీ ఆంజనేయస్వామికి పూజలు నిర్వహిస్తుండగా ఎక్కడినుండి వచ్చిందోగానీ ఓ వానరం మంత్రిపక్కకు వచ్చి కూర్చుంది. ఎవ్వరికీ భయపడకుండా నిర్భయంగా వచ్చి మంత్రి దగ్గర కూర్చోవడం అందరినీ ఆశ్చర్యపర్చింది. మంత్రి ఉషశ్రీకి ఏమయినా హాని తలపెడుతుదేమోనని భయపడిపోయిన భద్రతా సిబ్బంది వానరాన్ని తరమడానికి ప్రయత్నించినా అక్కడినుండి అది కదల్లేదు. దీంతో ఓవైపు వానరాన్ని పరిశీలిస్తూనే మరోవైపు మంత్రి ఆంజనేయస్వామి పూజలు నిర్వహించారు.
అయితే కొత్తగా మంత్రిపదవి పొందిన ఉషశ్రీకి ఆంజనేయస్వామి ఆశిస్సులు కూడా లభించాయని ఆమె అభిమానులు అంటున్నారు. సాక్షాత్తు ఆ ఆంజనేయస్వామే వానరం రూపంలో వచ్చి ఉషశ్రీని ఆశీర్వదించారని అంటున్నారు. ఈ దేవుడి ఆశిస్సులతో స్త్రీ శిశు సంక్షేమ శాఖ బాధ్యతలను కూడా ఉషశ్రీ సమర్ధవంతంగా నిర్వర్తిస్తారని వైసిపి శ్రేణులు, ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఇక మంత్రి ఉషశ్రీ వానరం సమక్షంలో పూజలు నిర్వహిస్తున్న పోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైసిపి సోషల్ మీడియా విభాగాలు, మంత్రి అనుచరులు ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నాయి. నెటిజన్లకు కూడా వానరంతో మంత్రి ఫోటోలు, వీడియోలు నచ్చడంతో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
