గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. చినరాజప్పకు వైఎస్ జగన్ ను విమర్శించే స్థాయి కాదన్నారు. 

గుంటూరులో మీడియాతో మాట్లాడిన మోదుగుల ఐదేళ్లు హోంశాఖ మంత్రిగా పనిచేసిన చినరాజప్ప కనీసం హోంగార్డు పోస్టింగ్ ను కూడా మార్చలేని స్థితిలో ఉన్నారన్నారు. ఎక్కడైనా హోం శాఖ మంత్రికి డీజీపీ సెల్యూట్ చేస్తారని కానీ చినరాజప్ప మాత్రం డీజీపీకి సెల్యూస్ చేస్తారని విమర్శించారు. 

చినరాజప్ప పేరుకే హోంశాఖ మంత్రి అని పవర్ అంతా వేరొకరి చేతిలో ఉందన్నారు. డమ్మీ మంత్రివైన నువ్వు వైఎస్ జగన్ ను విమర్శిస్తావా అంటూ నిలదీశారు. ఎన్నికల సమయంలో వైసీపీ దాడులు చేసిందని వ్యాఖ్యానించిన చినరాజప్ప హోంశాఖ మంత్రిగా ఏం చేశావని ప్రశ్నించారు. 

ప్రతిపక్షం దాడులు చేస్తుంటే చేతులు ముడుచుకుని కూర్చున్నారా అంటూ మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతోపాటు ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడంలో విఫలమైన చినరాజప్ప హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. 

ఇకపోతే చంద్రబాబు అత్యవసర రివ్యూలు కేవలం కలెక్షన్ల కోసమేనని ఆరోపించారు. సీఆర్‌డీఏ అధికారులతో రివ్యూ మీటింగ్ కేవలం కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకేనని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విమర్శించారు.