గుంటూరు: మహా కూటమి అపవిత్ర కలయిక అంటూ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విమర్శించారు.ఏపీ ప్రజల అభివృద్ధిని  వదిలేసి తన కొడుకు అభివృద్ధి కోసం చంద్రబాబు పాటుపడుతున్నారన్నారు. మామను వెన్నుపోటు పొడవడంలో బాబు సీనియర్ అంటూ మోడీ ఎద్దేవా చేశారు. గుంటూరు వేదికగా బాబుపై మోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో  ఏపీలో టీడీపీ ఓటమి పాలు కానుందని మోడీ జోస్యం చెప్పారు.

గుంటూరులో బీజేపీ నిర్వహించిన ప్రజా చైతన్య వేదిక సభలో  ప్రధానమంత్రి మోడీ ఆదివారం నాడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుగులో శుభాకాంక్షలను  చెప్పారు మోడీ.  గుంటూరు జిల్లాలో పుట్టిన గుర్రం జాషువా, తిక్కన్న, వావిలాల గోపాలకృష్ణయ్యలను మోడీ తన ప్రసంగంలో గుర్తు చేసుకొన్నారు.

 మోడీ తన ప్రసంగంలో  వావిలాలకు వందనాలు చెప్పారు. ఎంతో మంది ప్రముఖులను  ఈ గుంటూరు జిల్లా నుండి వచ్చినవారేనని ఆయన గుర్తు చేశారు.అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్‌ ఆక్స్‌ఫర్డ్‌గా వర్ణిస్తారని ఆయన చెప్పారు. గుంటూరుకు సమీపంలోని అమరావతికి ఎంతో చరిత్ర ఉందని ఆయన గుర్తు చేశారు. అమరావతిని హెరిటేజ్‌ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

పార్టీలు ఫిరాయింపులు చేయడంలో సీనియర్లన్నారు. కొత్త కొత్త కూటములను కట్టగట్టడంలో కూడ సీనియర్ అని చెప్పారు.ఇవాళ ఎవరిని తిడుతారో...ఆ తర్వాత వారి ఒడిలో కూర్చోవడంలో కూడ మీరే సీనియర్‌ అంటూ బాబుపై విమర్శలు గుప్పించారు.

ప్రతి ఎన్నికల్లో ఓటమి పాలు కావడం కూడ మీరే సీనియర్ అంటూ బాబును ఉద్దేశించి మోడీ విమర్శించారు. మామను వెన్నుపోటు పొడవడంలో కూడ మీరే సీనియర్ అంటూ ఎద్దేవా చేశారు. 

ఎన్టీఆర్ రాజకీయ వారసులిగా వచ్చిన మీరు.... ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నారా.... ఎన్టీఆర్‌కు గౌరవం ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు రాష్ట్రాభివృద్ధిని వదిలి పెట్టి నన్ను  తిట్టడమే పనిగా పెట్టుకొన్నారని చెప్పారు.

మీరు సీనియర్‌ నేత.... కానీ, మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఏనాడూ విస్మరించలేదన్నారు. బాబు నాకంటే సీనియర్... ఇందులో వివాదం లేదని మోడీ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు చంద్రబాబునాయుడు తన స్టిక్కర్లు వేసుకొంటున్నారని మోడీ విమర్శించారు.

ఏపీ ప్రజల కలలను ధ్వంసం చేయడంలో కూడ సీనియర్ అన్నాడన్నారు. ఎన్టీఆర్ కలలను కూడ బాబు ధ్వంసం చేశాడన్నారు. కూలిపోయిన తన పార్టీని నిర్మించుకోవడంలో చంద్రబాబునాయుడు బిజీగా ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.కేంద్రం నుండి ఎన్ని నిధులు ఇచ్చామో  చెప్పమంటే  బాబు లెక్కలు చెప్పడం లేదన్నారు.

ఢిల్లీలో దీక్ష పేరుతో ఫోటోలు తీయించుకొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీకి వస్తున్నారని చెప్పారు. ఈ దీక్షకు  నిధులు ఎక్కడివో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

గతాన్ని మర్చిపోయి చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నారని మోడీ చెప్పారు.  ఎన్టీఆర్‌తో పాటు రాష్ట్రానికి చెందిన నేతలను  కాంగ్రెస్ పార్టీ అవమానించిందన్నారు. ఎన్టీఆర్‌ను  అవమానించిన కాంగ్రెస్‌తో  మీరు ఎలా అంటకాగారో చెప్పాలన్నారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీని దుష్ట కాంగ్రెస్ పార్టీ అంటే... చంద్రబాబునాయుడు ఆ పార్టీతో దోస్తీ కట్టారని మోడీ గుర్తు చేశారు.

55 నెలల్లో ఏపీ రాష్ట్రానికి నష్టం చేయలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తే అసెంబ్లీలో అభినందిస్తూ తీర్మానం చేసిన విషయాన్ని కూడ ఆయన గుర్తు చేశారు. 2016 సెప్టెంబర్  మాసంలో దీన్ని అమలు చేస్తే దీన్ని సరిగా చంద్రబాబునాయుడు ఉపయోగించుకోలేకపోయారన్నారు. రూ. 3 లక్షల కోట్ల కంటే ఎక్కువ నిధులను రాష్ట్రానికి ఇచ్చినట్టు మోడీ వివరించారు.

విభజన చట్టంలోని అంశాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని  మోడీ చెప్పారు.  ఏపీ ప్రజలకు న్యాయం జరిగేలా పని చేస్తామన్నారు. ఏపీ ప్రజలు సంస్కారవంతులని దేశ ప్రజలకు తెలుసునని చెప్పారు.

డిక్షనరీలోని తిట్లన్నీ కూడ తనను  తిట్టేందుకు బాబు ఉపయోగిస్తున్నారని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఓటమి పాలు కానుందన్నారు. ప్రజలు ఏపీ సర్కార్‌కు వ్యతిరేకంగా తీర్పును ఇవ్వనున్నారని మోడీ  అభిప్రాయపడ్డారు.ఏపీలోని తండ్రీ కొడుకుల పాలన అంతం కానుందన్నారు. 

కేంద్రంలో మరోసారి  బీజేపీ అధికారంలోకి వస్తోందన్నారు.  అందుకే తమను గో బ్యాక్ అంటున్నారని మోడీ చమత్కరించారు. తన పర్యటన సందర్భంగా నల్ల బెలూన్లను ఎగురవేయడాన్ని  ఆయన  ప్రస్తావిస్తూ... ఏదైనా కొత్త కార్యక్రమం ప్రారంభించే సమయంలో దిష్టి తీయడం సంప్రదాయమన్నారు. మీ నల్ల బెలూన్లతో నా కార్యక్రమానికి దిష్టి తీశారని భావిస్తున్నట్టు మోడీ చెప్పారు.

వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులకు కొద్ది సేపటి క్రితమే తాను శంకుస్థాపన చేసినట్టు ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టుల వల్ల  దేశానికి కూడ ఉపయోగం కలుగుతోందన్నారు.
పెట్రోలియం రంగంలో కొరత ఏర్పడకుండా  చమురు నిల్వల కోసం ఈ రకమైన పథకాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీ రాష్ట్రంలోని విశాఖలో కూడ ఇలానే  ఏర్పాటు చేశామని చెప్పారు.

ఈ కొత్త ప్రాజెక్టుల వల్ల నిరుద్యోగులకు ఉపాధి లభించనుందని మోడీ చెప్పారు.  నిన్న అస్సాంలో నార్త్‌ఈస్టన్ గ్యాస్ గ్రిడ్‌ను ప్రారంభించినట్టు చెప్పారు.కొత్త భారత నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నట్టు మోడీ చెప్పారు.  కొత్తగా ప్రాజెక్టులు చేపట్టిన జిల్లాకు చెందిన ప్రజల జీవనంలో చాలా మార్పులు రానున్నాయని మోడీ అభిప్రాయపడ్డారు.

కొన్ని రోజుల్లో దేశంలోని అన్ని పట్టణాల్లో కూడ ఇదే రకమైన మార్పులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వంపై, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మోడీ చెప్పారు.