డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు మరోసారి రిమాండ్ పొడిగించింది కోర్లు. 15 రోజుల రిమాండ్ పొడిగిస్తూ.. కేసును ఈ నెల 18కి వాయిదా వేసింది.
కాకినాడ : ఎమ్మెల్సీ అనంతబాబు కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఆయన రిమాండును రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. గతంలో ఆయనకు విధించిన రిమాండ్ శుక్రవారంతో పూర్తి అయ్యింది. దీంతో, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు శుక్రవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ మేరకు విచారణ జరిపిన తరువాత ఈ నెల 15 వరకు న్యాయమూర్తి అనంత బాబుకు రిమాండ్ను పొడిగించారు. గతం రెండు సార్లు.. అనంత బాబును జైలు నుంచి కోర్టుకు తరలించే ఎస్కార్ట్ అందుబాటులో లేరనే కారణంతో ఆన్లైన్ ద్వారా రిమాండ్ పొడగించారు. అయితే, తాజాగా ఈసారి పోలీసులు ఎస్కార్ట్ ఏర్పాటు చేయడంతో ప్రత్యేక వాహనంలో ఎమ్మెల్సీని కేంద్ర కారాగారం నుంచి తీసుకువచ్చారు. కోర్టులో హాజరుపరిచారు.
చర్చనీయాంశంగా పోలీసుల తీరు..
సాధారణంగా అయితే జైల్లో ఉన్న నిందితులను కోర్టుకు తరలించేటప్పుడు పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే పోలీసు వాహనంలో నుంచి నిందితుడిని కోర్టు బయట దించి… కోర్టు ఆవరణలోకి నడిపించుకుంటూ తీసుకువెళ్లాలి. అయితే, దీనికి విరుద్ధంగా శుక్రవారంనాడు ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు వెహికిల్ లోనే కోర్టు ఆవరణలోకి తీసుకువెళ్లారు. విచారణ తరువాత మాత్రమే కోర్టు ప్రాంగణం నుంచి అనంత బాబును నడిపించుకుంటూ కోర్టు బయటకు తీసుకువచ్చారు. ఆ తరువాత వాహనంలో ఎక్కించుకుని జైలుకు తరలించారు. దీంతో ఈ విషయం కోర్టు పరిసరాల్లో చర్చనీయాంశంగా మారింది.
విచారణను సీబీఐకి అప్పగించాలి:ఏపీ సీఎస్, డీజీపీలకు డ్రైవర్ సుబ్రమణ్యం తల్లి లేఖ
చార్జిషీట్ నమోదు చేయలేదు…
సుబ్రహ్మణ్యం హత్య జరిగి నలభై రోజులు గడిచింది. అయినా, ఇప్పటికి ఛార్జ్ షీట్ నమోదు చేయలేదని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు అన్నారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మంధాత సీతారామమూర్తి, సభ్యుడు గోచిపాత శ్రీనివాసరావు ఎదుట రెండో రోజు శుక్రవారం అనంత బాబు కేసు విచారణ జరిగింది. ఆ తరువాత విషయాలను న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు వివరించారు. ఈ కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం 15ఎ ప్రకారం విచారణ మొత్తాన్ని వీడియో తీయాల్సి ఉంది. అయితే, అలా జరగలేదని తదుపరి విచారణను కమీషనర్ ఈ నెల 18కి వాయిదా వేసిందని తెలిపారు.
