కరోనా వైరస్ రాష్ట్రంలో విలయతాండవం చేస్తోంది. అలాంటి సమయంలో లాక్ డౌన్ ని ఉల్లంఘించారంటూ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. కాగా.. తనకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంపై తాజాగా ఎమ్మెల్యే విడదల రజనీ స్పందించారు.

కుట్రలో భాగంగానే తనకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని ఎమ్మెల్యే విడదల రజనీ అన్నారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తాను ఇంట్లో కూర్చోలేనని అన్నారు. 

తాను నిబంధనలు అతిక్రమించి ఉంటే.. తన నియోజకవర్గంలో కరోనా కేసులు వచ్చిఉండేవన్నారు. తన నియోజకవర్గం పరిధిలో ఒక్క పాజిటీవ్ కేసు కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని రజనీ తెలిపారు. 

టీడీపీకి రాజకీయాలు తప్ప ప్రజల బాగోగులు పట్టవని విమర్శలు గుప్పించారు. మద్యం షాపులు తెరిచే నిర్ణయం కేంద్రానిదని స్పష్టం చేశారు. అమ్మకాలు తగ్గాలనే ఉద్దేశంతో సీఎం జగన్ మద్యం ధరలు పెంచారని రజనీ వివరించారు. 

మద్యం షాపుల వద్ద గుంపులపై టీడీపీ కుట్ర ఉందని రజనీ ధ్వజమెత్తారు. మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు నిజమేనేమో అనిపిస్తుందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తన పని తాను చేసుకుంటానని ఎమ్మెల్యే రజనీ స్పష్టం చేశారు.