జమ్మలమడుగు: వైసీపీకి చెందిన జమ్మలమడుగు నేతల మధ్య సయోధ్యకు ఆ పార్టీ అధిష్టానం చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి.  మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఇంట్లో బ్రేక్ ఫాస్ట్  సమావేశానికి జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు.గత ఏడాది టీడీపీ నుండి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడాన్ని ఎమ్మెల్సీ సుధీర్ రెడ్డి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ  వైసీపీ మాత్రం రామసుబ్బారెడ్దిని  తమ పార్టీలోకి తీసుకొంది.

రామసుబ్బారెడ్డి. సుధీర్ రెడ్డి వర్గీయుల మధ్య సయోధ్య కుదరలేదు. గత నెలలో  ఈ రెండు వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. గతంలో కూడా ఇదే తరహా ఘటనలు చోటు చేసుకొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తమను కలుపుకుపోవడం లేదని రామసుబ్బారెడ్డి వర్గీయులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో కలిసి ఏపీ సీఎం వైఎస్ జగన్ ను గత వారం రోజుల క్రితం కలిశారు.

also read:అమరావతికి చేరిన వైసీపీ జమ్మలమడుగు పంచాయితీ: జగన్ తో రామసుబ్బారెడ్డి భేటీ

జమ్మలమడుగు నియోజకవర్గంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన జగన్ కు వివరించారు. ఈ తరుణంలో ఇద్దరు నేతలు కలిసి పనిచేయాలని జగన్ సూచించారు. ఇదే విషయమై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడ ఇద్దరు నేతలతో చర్చించారు. ఇద్దరు నేతల  మధ్య రాజీకి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తన వంతు ప్రయత్నాలను మొదలుపెట్టారు.

ఉగాదిని పురస్కరించుకొని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఎంపీ అవినాష్ రెడ్డి తీసుకొచ్చారు. నేతలంతా కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఇద్దరు నేతల మధ్య చోటు చేసుకొన్న సమస్యలపై చర్చించారు. ఇప్పటివరకు చోటు చేసుకొన్న సమస్యలను పక్కనపెట్టి  కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకొన్నారు.