తిరుపతి: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు ప్రయత్నించినవారే మున్సిపల్ ఎన్నికల్లో కూడ పార్టీ అభ్యర్ధులను ఓడించే ప్రయత్నం చేస్తున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్ కె రోజా సంచలన ఆరోపణలు చేశారు. స్వంత పార్టీకి చెందిన నేతలపై ఆమె  సంచలన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బుధవారం నాడు  మున్సిపల్ ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకొన్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.నగరి అసెంబ్లీ నియోజకవర్గంలోని నగరి, పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను ఓడించేందుకు గాను రెబెల్స్ ను రంగంలోకి దింపారని ఆమె ఆరోపించారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు ప్రయత్నించినవారే మున్సిపల్ ఎన్నికల్లో కూడ పార్టీ అభ్యర్ధులను ఓడించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె చెప్పారు.

రెబెల్స్ అభ్యర్ధులకు మద్దతుగా లేఖలు, వీడియోల ద్వారా ప్రచారం చేస్తున్నారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ రెండు మున్సిపాలిటీల్లో టీడీపీ విజయం సాధించినా ఫర్వాలేదు, కానీ వైసీపీ అభ్యర్ధుల ఓటమికి రెబెల్స్ ప్రయత్నిస్తున్నారన్నారు. రెబెల్స్ గా రంగంలో ఉన్నవారికి పెద్ద ఎత్తున డబ్బులు అందించారన్నారు.

ఎన్నికల తర్వాత అన్ని ఆధారాలతో ఈ విషయాలపై  పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తానని ఆమె హెచ్చరించారు. నేతల మధ్య ఎన్ని గొడవలున్నా కూడ ఎన్నికల సమయంలో పార్టీని గెలిపించుకొనేందుకు ప్రయత్నించాలని.. కానీ పార్టీ ఓడిపోయినా కూడ ఫర్వాలేదనే ధోరణి సరికాదని రోజా చెప్పారు.