తన ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానని అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. ఒక్కొక్కరుగా టీడీపీని వీడి.. వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొందరు పార్టీని వీడగా.. మరికొందరు వీడుతున్నారనే ప్రచారం మొదలైంది.

పార్టీని వీడేవారిలో ఎమ్మెల్యే పీలా పేరు కూడా ప్రధానంగా వినపడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు.  తమ కుటుంబం టీడీపీలో ఒక భాగమని చెప్పారు. టీడీపీ ఆవిర్భావం నుంచి తన తండ్రి రెండు సార్లు పెందుర్తి ఎంపీపీగా విజయం సాధించారని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఫోటోతోనే తాను గెలిచానని.. పార్టీ మారే ఆలోచన తనకు లేదని చెప్పారు.

తనపై వస్తున్న ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేశారు. 2014లో అనకాపల్లిలో నాయకుల పేర్లు కూడా తనకు తెలియవని.. అలాంటిది 23వేల మెజార్టీతో గెలిచానని అందుకు చంద్రబాబే కారణమన్నారు. ప్రాణం వున్నంత వరకు టీడీపీలో కొనసాగుతానని గోవింద స్పష్టంచేశారు. వ్యాపార రీత్యా ఇతర పార్టీల నేతలతో కలుస్తుంటానని, దానికే పార్టీ మారుతానని అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు.

మనోభావాలు దెబ్బతినేలా కథనాలు రాయవద్దని హితవు పలికారు. వచ్చే ఎన్నికలలో అధిష్ఠానం ఆదేశాల మేరకు పనిచేస్తానని అన్నారు. సమర్థుడైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారథ్యంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తానన్నారు.