ఒంగోలు:  వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత ఆమంచి కృష్ణమోహన్ మీద శాసనసభ్యుడు కరణం బలరాం పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గాలిలోనే చీరాల ప్రజలు టీడీపీ అభ్యర్థిని గెలిపించారంటే అవతలి వ్యక్తిపై ఉన్న వ్యతిరేకత అని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. 

టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన కరణం బలరాం ఆ మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారిన విషయం తెలిసిందే. సాంకేతికంగా మాత్రమే ఆయన వైసీపీలో చేరలేదు. ప్రజా ప్రతినిధుల కోసం వచ్చేవారితో సరిగా మాట్లాడడం నేర్చుకోవాలని ఆయన సూచించారు. 

ఓట్లు వేయలేదని కొంత మందిని ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆమంచిని ఉద్దేశించి అన్నారు. శాంతిభద్రతల విషయంలో చీరాల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎవరో వచ్చి ఇబ్బందులు పెడుతుంటే చూస్తూ సహించబోనని ఆయన హెచ్చరించారు. 

చీరాల నియోజక వర్గంలో ఆమంచి కృష్ణమోహన్ కు, కరణం బలరాంకు మధ్య పడడం లేదు. ప్రస్తుతం ఇద్దరు కూడా ప్రస్తుతం వైసీపీలో ఉన్నట్లే. వారి మధ్య విభేదాలను వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎలా పరిష్కరిస్తారనేది చూడాల్సే ఉంది.