Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్: హోమ్ క్వారంటైన్ కి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. అధికారుల సూచనల మేరకే తాను హోం క్వారంటైన్ కు వెళ్లినట్లు తెలిపారు. తనకు పరీక్షల్లో కరోనా నెగెటివ్ వచ్చిందని హఫీజ్ ఖాన్ చెప్పారు.

MLA Hafeez Khan home quarantined in Kurnool district
Author
Kurnool, First Published Apr 17, 2020, 4:15 PM IST

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. అధికారుల సూచనతో ఆయన హోం క్వారంటైన్ లోకి వచ్చింది. హఫీజ్ ఖాన్ కు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని, దాంతో ఆ విషయంపై స్పష్టత ఇవ్వడానికి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశానని హఫీజ్ ఖాన్ చెప్పారు. 

ప్రజలను అప్రమత్తం చేయడానికి రెడ్ జోన్ ప్రాంతాల్లో తాను విరివిగా తిరిగానని, కరోనా వైరస్ వ్యాపిస్తున్న తొలి దశలో ప్రజలను చైతన్యవంతులను చేయడం అవసరంగా మారిందని ఆయన చెప్పారు. తాను కరోనా పరీక్షలు చేయించుకున్నానని, తనకు నెగెటివ్ వచ్చిందని, అయినప్పటికీ తాను హోం క్వారంటైన్ కు వెళ్తున్నానని ఆయన చెప్పారు. పరీక్షలు చేయించుకోవడం తప్పు లేదని చెప్పడం తన ఉద్దేశమని ఆయన చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా 13 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 126కు చేరుకుంది. 

కరోనా వైరస్ వల్ల ఇటీవల మరణించిన వైద్యుడి ఇంట్లో ఆరుగురికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. కాగా ఎమ్మిగనూరులో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఎమ్మిగనూరులో మరణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. శ్వాససంబంధమైన సమస్యతో అతను ఇటీవల కర్నూలు ఆస్పత్రిలో చేరాడు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఢిల్లీ మర్కజ్ లింకులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64కు చేరుకుంది.  

ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారి నుంచే కోరనా వైరస్ వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. తాజాగా నమోదైన కేసులు అందుకు సంబంధించి సెకండ్ కాంటాక్టులని చెబుతున్నారు. నెల్లూరు నగరంలోనే 25 కేసులు నమోదయ్యాయి.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572కు చేరుకుంది. కరోనా వైరస్ వ్యాధి సోకి ఏపీలో 14 మంది మరణించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios