నారా లోకేష్‌తో గంటా శ్రీనివాసరావు భేటీ.. 40 నిమిషాల పాటు చర్చలు.. అందుకోసమేనా..?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ఈ సమావేశం జరిగింది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో ఈ సమావేశం జరిగింది. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో.. ఇరువురు నేతల మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. అయితే చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న గంటా శ్రీనివాసరావు.. ఇందుకు సంబంధించిన అంశాలను లోకేష్‌కు వివరించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ భేటీ తర్వాత గంటా శ్రీనివాసరావుపై టీడీపీ అధిష్టానం వైఖరి ఎలా ఉంటుంది?, మరోవైపు ఆయన కూడా ఏ విధంగా ముందుకు సాగనున్నారనేది వేచిచూడాల్సి ఉంది.
అయితే ఇటీవల చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాల్లో మార్పు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే గంటా శ్రీనివాసరావు వెళ్లి లోకేష్‌ను కలవడంపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానానికి దగ్గరయ్యేందుకు గంటా శ్రీనివాసరావు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతుంది.
ఇక, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు.. ఆ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ.. అధిష్టానం, పార్టీ నేతలతో గ్యాప్ మెయింటెన్ చేస్తున్నారు. ఆయన అధికార వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారనే ప్రచారం కూడా సాగింది. అయితే ఆ దిశగా మాత్రం గంటా అడుగులు వేయలేదు. మరోవైపు ఒకటి, రెండు సందర్భాల్లో చంద్రబాబును కలిసి గంటా శ్రీనివాసరావు.. పార్టీలో ఉన్నాననే సంకేతాలు పంపారు.
కానీ టీడీపీ నేతలు మాత్రం ఆయన వ్యవహార శైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ నిర్వహించిన కార్యక్రమాల్లోనైతే గంటా శ్రీనివాస్ పాల్గొనలేదు. పార్టీ లైన్‌కు మద్దతుగా కూడా ఆయన ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే ఇటీవల కూడా గంటా శ్రీనివాసరావు పార్టీ మారబోతున్నారని.. వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటారని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారంపై స్పందించిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది రెండు పార్టీలు మాత్రమే కాదని అన్నారు. పార్టీ మార్పుపై తాను ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటే తానే ప్రకటిస్తానని చెప్పారు. మరోవైపు కాపులు నిర్వహించిన ఓ సమావేశంలో కూడా గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆ తర్వాత కాపునాడు సభకు మాత్రం హాజరుకాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో లోకేష్‌తో గంటా శ్రీనివాసరావు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.