జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం అమరాతి పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా.. పవన్ పర్యటనపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ అందినప్పుడు ఒక విధంగా.. అందనప్పుడు  మరో విధంగా మాట్లాడటం పవన్ కి అలవాటు అయ్యిందని విమర్శించారు.

బేతపూడి గ్రామంలో పర్యటించినప్పుడు అక్రమాలు జరుగుతున్నాయని చెప్పిన పవన్... దమ్ముంటే చంద్రబాబు హయంలో జరిగిన మోసాలను బయటపెట్టాలని సవాల్ విసిరారు. భూ సేకరణ చేస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న పవన్.. నాలుగుసార్లు భూసేకరణ జరిగినప్పుడు ఏమయ్యారని ఆళ్ల ప్రశ్నించారు.

పవన్ కి నిజంగా రాజధాని అంటే అభిమానం ఉంటే ఇక్కడి నుంచి ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. కనీసం జనసేన అభ్యర్థిని కూడా ఎందుకు పోటీకి దింపలేదని ప్రశ్నించారు. కమ్యూనిస్టులతో పొత్తు కారణంగా సీటు ఇచ్చారని అనుకున్నా.. వారి కోసం ఎందుకు ప్రచారం చేయలేదో చెప్పాలన్నారు.

లోకేష్ ని గెలిపించడానికి తెర వెనుక పవన్ చేసిన ప్రయత్నాలన్నీ రాజధాని రైతులకు తెలుసునని ఆళ్ల పేర్కొన్నారు. ఇన్ని రోజులు పత్తాలేకుండా పోయిన పవన్ కి ఇప్పుడు ఉన్నపళం రైతులపై ప్రేమ పుట్టుకొచ్చిందంటే ఎవరూ నమ్మరని ఆయన అన్నారు.